సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 మే 2023 (08:55 IST)

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేపై రూ.1000 కోట్ల పరువు నష్టం దావా

raghunandan rao
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) టోల్‌ వసూలు లీజ్‌కు సంబంధించి ఐఆర్‌బీ సంస్థ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఈ పరువు నష్టం దావా నోటీసులను పంపించింది. 
 
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌(ఓఆర్‌ఆర్‌) రోడ్డుపై తిరిగే వాహనాల నుంచి టోల్‌ వసూలు కాంట్రాక్ట్‌ టెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఐఆర్‌బీ డెవలపర్స్‌ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్‌ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పలు ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఓఆర్‌ఆర్‌ టోలింగ్‌, నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్‌లో ఐఆర్‌బీ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. 158 కిలోమీటర్ల రహదారి టోలింగ్‌, నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏకు రూ.7,380 కోట్లు ముందస్తుగా చెల్లించింది. ఈ ఒప్పందం 30 ఏళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఈ ఒప్పందంలో అవకతవకలు, అవినీతి జరిగిదంటూ రఘునందన్ రావు ఆరోపణలు చేయడంతో ఆగ్రహించిన ఐఆర్‌బీ సంస్థ ఈ నోటీసులను పంపించింది.