గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మైనర్లను మేజర్లుగా పరిగణించండి - విచారణకు కోర్టు అనుమతి

arrest
హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును పోలీసులు అభ్యర్థించారు. తీవ్ర స్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని, ఈ మేరకు గత 2015లో జువైనల్ చట్టానికి చేసిన చట్ట సవరణను తెరపైకి తెచ్చి, బోర్డును వివరించారు. 
 
2019లో చాంద్రాయణగుట్టలో పదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడి చేసిన 17 ఏళ్ల బాలుడికి జువెనైల్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. అదే తరహాలో జూబ్లీహిల్స్‌లో బాలికపై మైనర్లు అత్యాచారానికి పాల్పడటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాము నేరం చేస్తున్నామన్న విచక్షణతోనే ఇదంతా చేశారని పోలీసులు జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో అయిదుగురు మైనర్లలో ముందుగా పట్టుబడిన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, సంగారెడ్డి జిల్లా అధికార పార్టీ నేత తనయుడు, కార్పొరేటర్‌ పుత్రునికి అయిదు రోజుల పాటు జువెనైల్‌ కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతించింది. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు వీరిని పోలీసులు విచారించనున్నారు. 
 
మిగిలిన ఇద్దరు నిందితుల్లో ఎమ్మెల్యే తనయుడు, బెంజ్‌కారు యజమాని కుమారుడి కస్టడీపై శుక్రవారం తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. ముగ్గురు మైనర్లను జువెనైల్‌ హోంలో న్యాయవాది సమక్షంలో సివిల్‌ దుస్తుల్లో పోలీసులు విచారించాలని కోర్టు ఆదేశించింది. నిందితులను బాధితురాలు గుర్తించేందుకు వీలుగా టెస్ట్‌ ఆఫ్‌ ఐడెంటిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. నేరాన్ని రుజువు చేసేందుకు కీలకమైన లైంగిక పటుత్వ పరీక్ష (పొటెన్సీ)ను వైద్య నిపుణులతో చేయించనున్నారు.