1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (17:48 IST)

నేనెవరో తెలియాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి : కేఏ పాల్

ka paul
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరో తెలియదంటూ వరంగల్ నగర కమిషన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే కౌంటరిచ్చారు. తాను ఎవరో తెలియాలంటే గూగుల్ సెర్చ్‌ చేయాలని సూచించారు. 
 
ఈ నెల 6వ తేదీన హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకునేందుకు తమ పార్టీ అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని కేఏ పాల్ ఆరోపించారు. ఓటు బ్యాంకు లేని రాహుల్ గాంధీకి మాత్రం అనుమతిచ్చారని ఆయన మండిపడ్డారు. 
 
రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్నందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి తమ పార్టీ  సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పైగా, తన సభకు అనుమతి ఇవ్వొద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను సీఎం కేసీఆర్ బెదిరించారని  ఆరోపించారు. 
 
బంగారు తెలంగాణా చేస్తానని చెప్పి, అప్పుల సర్కారు చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడుతామని కేఏ పాల్ ప్రకటించారు. నిన్నగాక మొన్న రాహుల్ సభకు అనుమతి ఇచ్చి ఇపుడు తనకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. తానెవరో తెలియదంటూ కమిషనర్ అన్నారని, గూగుల్‌లో నా పేరు వెతికితే తాను ఎవరో తెలుస్తుందన్నారు. సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆగే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.