యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో నలుగురు సీఎంలు
తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి సన్నిధిలో నలుగురు ముఖ్యమంత్రులు కెమెరా కంటికి చిక్కారు. ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభ బుధవారం జరుగనుంది. ఇందులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌లు స్వామివారి దర్శనం కోసం వెళ్లారు. అలాగే, యూపీ మాజీ సీఎం అఖిలేష్ సింగ్ యాదవ్‌తో పాటు సీపీఐ జాతీయ నేత రాజాతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ తన నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఇందులో జాతీయ నేతలంతా పాల్గొన్నారు. ఆ తర్వాత వారంతా యాదాద్రికి బయలుదేరి వెళ్లారు. అక్కడ నరసింహా స్వామి దర్శనం చేసుకుంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగంతో పాటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పూలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా చిత్రీకరించారు. ముఖ్యమంత్రుల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను సిద్ధంగా ఉంచారు. యాదాద్రి వ్యాప్తంగా 2 వేలమంది పోలీసులతో భద్రత కల్పించారు.