శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:58 IST)

న‌ల్గొండ జిల్లాకు కేసీఆర్ బ‌ద్ద విరోధి: కోమటిరెడ్డి

కేసీఆర్‌కు ఓట్లు, నోట్లు, సీట్ల మీద త‌ప్ప ప్ర‌జా సంక్షేమం మీద శ్ర‌ద్ధ లేద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మండిప‌డ్డారు. నేడు న‌కిరేక‌ల్ ప‌ట్ట‌ణ మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో భాగంగా ప‌ట్ట‌ణ 11, 14, 19వ వార్డు కాంగ్రెస్ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అక్రమంగా డ‌బ్బు ఖ‌ర్చు పెడుతూ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిప‌డ్డారు. న‌ల్గొండ జిల్లాకు బ‌ద్దవిరోధి అయిన కేసీఆర్‌కు బుద్ది చెప్పాలంటే న‌కిరేక‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఉన్న వారిని అభ్య‌ర్థులుగా నిలిపి టీఆర్ఎస్ ఓట్లు కోనే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌న్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసే వ్య‌క్తులు అభ్య‌ర్థులుగా ఉన్నార‌ని వారిని గెలిపించి కేసీఆర్‌కు త‌ప్ప‌కుండా బుద్ది చెప్పాల‌ని కోరారు. 
 
క‌రోనాసెకండ్ వేవ్ వేగంగా విస్త‌రిస్తున్న త‌రుణంలో ఎన్నిక‌లు ఎందుకు వాయిదా వేయ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు. నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల జ‌రిగితేనే న‌ల్గొండ జిల్లాలో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు తెలిపారు. అలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే ఈ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు వాయిదా వేయాలంటే ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ప్ర‌శ్నించారు.  నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి జానారెడ్డి ఘ‌న విజ‌యం సాధిస్తారు. కాబ‌ట్టి త‌రువాత ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఓడిపోతార‌నే భ‌యంతోనే క‌రోనా కాలంలో ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.
 
అలాగే న‌కిరేక‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి త‌మ పార్టీలో చేర్చుకుంటున్నార‌ని వివ‌రించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల మీద ఒక్క దెబ్బ ప‌డ్డ‌... తిరిగి ప‌ది దెబ్బ‌లు టీఆర్ఎస్ నేత‌లు ప‌డాల్సి వ‌స్తుందని స్ప‌ష్టం చేశారు. బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డితే అదే రీతిలో త‌గిన బుద్ది చెబుతామ‌ని టీఆర్ఎస్ నేత‌ల‌ను హెచ్చ‌రించారు. రానున్న రెండేళ్ల‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రానున్న‌ద‌ని కాంగ్రెస్ కార్యక‌ర్త‌లు ధైర్యంగా ఉండాలన్నారు. 
 
పంట‌లు కోసి నెల రోజులు గ‌డుస్తున్న ఇప్ప‌టికీ ఒక్క ఐకేపీ సెంట‌ర్ ఎందుకు ప్రారంభించ‌లేదని స‌ర్కార్‌ను ప్ర‌శ్నించారు. ఆరు నెల‌లుగా క‌ష్ట‌ప‌డ్డ రైత‌న్న.. పంట‌ను అమ్ముకోవ‌డానికి ఐకేపీ కేంద్రాల వ‌ద్దకు తెచ్చి నెల‌రోజులుగా న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ప‌డిన అకాల వ‌ర్షానికి చాలా ధాన్యం త‌డిసిపోవ‌డం... నీటిలో కొట్టుకుపోవడం జ‌రిగిందని తెలిపారు. మ‌ళ్లీ ఒక అకాల వ‌ర్షం ప‌డితే ఆ ధాన్యం పాడ‌వుతుంది కాబ‌ట్టి వెంట‌నే ఐకేపీ సెంట‌ర్ల ప్రారంభం చేప‌ట్టాలని డిమాండ్ చేశారు.
 
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ కేసీఆర్ ధన దాహం వల్ల 4 లక్షల కోట్ల అప్పులకు చేరిందన్నారు. బంగారు తెలంగాణ అంటూ తన తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారని విమర్శించారు.
 
గ‌తంలో క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య శ్రీని చేర్చుతామ‌ని అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించిన కేసీఆర్ ఇప్పుడు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని మండిప‌డ్డార‌. క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న త‌రుణంలో  రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ చికిత్స అందుబాటులో ఉండే విధంగా వెంట‌నే క‌రోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పేద ప్ర‌జ‌ల‌కు క‌రోనా చికిత్స అంద‌క ఇబ్బందులు ప‌డితే స‌ర్కార్ భ‌ర‌తం ప‌డ‌తాఆమ‌ని హెచ్చ‌రించారు.