పల్లె ఆణిముత్యం పాటకు కేటీఆర్ ఫిదా.. ఛాన్సిస్తానన్న దేవీ శ్రీ ప్రసాద్ (video)
పల్లె ఆణిముత్యం పాటకు కేటీఆర్ ఫిదా అయ్యారు. తెలంగాణలోని మారుమూల పల్లెకు చెందిన ఓ యువతి పాటకు సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, ఎస్.ఎస్. తమన్‌లూ ఆమె పాటకు ముగ్ధులయ్యారు. మెదక్ జిల్లా నారైంగి అనే గ్రామానికి చెందిన శ్రావణి పాడిన ఈ జానపద గేయాన్ని.. సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్ వీడియో తీసి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.
ఈ అమ్మాయి పేరు శ్రావణి. తండ్రి పేరు లక్ష్మణ చారి. ఊరు మెదక్ జిల్లాలోని నారైంగి. ఓ పనికోసం ఊరికెళ్తే ఈ ఆణిముత్యాన్ని చూశాను. చాలా బాగా పాడుతోంది. ఆమె గాత్రం అద్భుతం. ఈ ట్యాలెంట్ ను ప్రోత్సహించేందుకు మీ మద్దతు, ఆశీర్వాదం కావాలి అని పేర్కొంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.
ఆ పాటను విన్న కేటీఆర్.. 'నిజంగా ట్యాలెంటెడ్' అంటూ తమన్, దేవిశ్రీలను ట్యాగ్ చేశారు. వారు కూడా ఆ పాటను విన్నారు. నిజంగా ఆమె ట్యాలెంట్ అద్భుతమంటూ దేవిశ్రీ ట్వీట్ చేశారు. ఇంత మంచి ట్యాలెంట్ ఉన్న అమ్మాయిని తమకు పరిచయం చేసినందుకు థాంక్యూ అంటూ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాను ఇప్పటికే ప్రపంచం చూడని ఇలాంటి వాళ్లకోసమే వెతుకుతున్నానని, కచ్చితంగా శ్రావణికి అవకాశాలిస్తానని హామీ ఇచ్చారు. స్టార్ టు రాక్ స్టార్ లో ఆమెతో పాడిస్తానని, ఆమె ట్యాలెంట్ ను అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు. ఇక, 'ఆమె బంగారం' అంటూ తమన్ ట్వీట్ చేశారు