సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (15:50 IST)

పదోసారి అమ్మాయి పుట్టిందని.. పాలుపట్టని కసాయి తల్లి..

ఆరుగురు అమ్మాయిలు... ముగ్గురు అబ్బాయిలు కలిగిన ఆ దంపతులకు అబ్బాయి కోసం తాపత్రయం మాత్రం తగ్గలేదు. పదోసారి మరో అబ్బాయి కోసం ప్రయత్నించిన ఆ దంపతులకు మళ్లీ ఆడపిల్లే పుట్టింది. కానీ పదోసారి పుట్టిన ఆ ఆడబిడ్డకు కన్నతల్లే పాలు పట్టలేదు.


బిడ్డ ఎలా వుందో చూసేందుకు కుటుంబీకులే రాలేదు. బిడ్డ పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నా పాలిచ్చేందుకు ఆ తల్లి ముందుకు రాలేదు. ఈ అమానుష ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. చందంపేట మండలం మోత్య తండాకు చెందిన ఇస్లావత్- సావిత్రిరాజు దంపతులకు తొమ్మిది మంది సంతానం వున్నారు. మంగళవారం సావిత్రి పదో సారిగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింది అబ్బాయి కాదని.. అమ్మాయేనని తెలుసుకున్న సావిత్రితో పాటు ఆమె కుటుంబ సభ్యులు నవజాత శిశువుకు శత్రువుగా మారిపోయారు. ఎవ్వరూ ఆ బిడ్డను కన్నెత్తిచూడలేదు. 
 
ఇంకా ఆ బిడ్డ పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తున్నా.. పాల పట్టకుండా ఆ తల్లి కూర్చుండిపోయింది. చివరికి పక్కనుండే వారు పోతపాలు పట్టి చిన్నారి ఆకలి తీర్చారు. బిడ్డను విక్రయించేందుకు చిన్నారి తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు తెలియడంతో ఐసీడీఎస్ సూపర్ వైజర్ వెంకటమ్మ ఆసుపత్రికి చేరుకుని మందలించారు.

చిన్నారి కనిపించకపోయినా, ఆమెకేమన్నా జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చివరికి పోలీసుల జోక్యంతో చిన్నారిని ఇంటికి తీసుకెళ్లేందుకు సావిత్రి కుటుంబీకులు అంగీకరించారు.