గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (12:03 IST)

తెలంగాణలో త్వరలో కొత్త ఉపకులపతులు

తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాలకు అతిత్వరలో కొత్త ఉపకులపతులు రానున్నారు. ప్రభుత్వం ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ నియామక దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసైకి పంపించింది.

గవర్నర్‌ ఆమోదం అనంతరం ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌, శాతవాహన, అంబేడ్కర్‌, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ వర్సిటీలకు 2019 జూన్‌ నుంచి ఐఏఎస్‌ అధికారులు ఇన్‌ఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.

ఈ పదవులకు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ వేగంగా జరగకపోవడంపై విద్యావేత్తలతో పాటు గవర్నర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాయి.

వరుస ఎన్నికలు, కరోనా ప్రభావంతో ఆ ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ పాలకమండలిని నియమించిన ప్రభుత్వం వీసీల నియామకాలను సైతం వెంటనే చేపట్టాలని భావించింది. అయితే, గవర్నర్‌ తమిళిసై ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నారు.

వీసీల దస్త్రానికి గురువారం ఆన్‌లైన్‌లో గవర్నర్‌ ఆమోదం తెలిపితే నియామక ఉత్తర్వులు వెలువడే వీలుంది. గవర్నర్‌ హైదరాబాద్‌ వచ్చాక ఆ దస్త్రాన్ని పరిశీలించే నేపథ్యంలో మరో రెండు రోజులు జాప్యం జరిగే అవకాశం ఉంది.