శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (19:02 IST)

హైదరాబాద్ లో సీట్ల కోసం పోటీ చేయడం లేదు: అమిత్‌ షా

సీట్లు పెంచుకోవడానికి  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, మేయర్‌ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో.. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు.

రోడ్‌ షో అనంతరం అమిత్‌ షా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రోడ్‌ షోలో స్వాగతం పలికిన హైదరాబాద్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీట్లు పెంచుకోవడానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, మేయర్‌ సీటు గెలుచుకోవడానికే పోటీ చేస్తున్నామన్నారు. బిజెపి అభ్యర్థే మేయర్‌ అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ను ప్రపంచ ఐటి హబ్‌గా మారుస్తామని చెప్పారు. ఎంఐఎం అండతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టిఆర్‌ఎస్‌ నడుస్తోందని విమర్శించారు. బిజెపి కి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని, సిటీలో వరదలు వచ్చినప్పుడు కెసిఆర్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కెసిఆర్‌ ఎవరితోనూ సమావేశం కాలేదని ఆరోపించారు. తన ప్రశ్నలకు కెసిఆర్‌ సమాధానాలు చెప్పాలని, ఫాం హౌస్‌ నుంచి బయటకు రావాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.