శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (08:09 IST)

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపు అన్న చర్చకు తెరలేచింది. ప్రధానంగా.. హైదరాబాద్‌లో నివసిస్తున్న రాయలసీమ వాసుల ఓట్లు.. ఏ పార్టీకి పోలవుతాయన్నది చర్చనీయాంశమైంది.

తాజా పరిణామలు, రాజకీయంగా చోటు చేసుకున్న సంఘటనల అనంతరం.. మారిన వాతావరణంలో సీమ వాసుల ఓట్లు, టీఆర్‌ఎస్‌కే గంపగుత్తగా పోలయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. దానికి బీజేపీ స్వయంకృతాపరాధమే కారణంగా చెబుతున్నారు.
 
నిజానికి హైదరాబాద్‌లోని సీమ వాసులు బీజేపీకి, ఆంధ్రా సెటిలర్లు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి జైకొట్టాలని నిర్ణయించుకున్నారట. సీమ వాసి అయిన ఏపీ సీఎం జగన్ వైసీపీ, రాజకీయంగా బీజేపీతో సఖ్యతగా వ్యవహరిస్తోంది. కేంద్రం కూడా తర రాష్ర్టాల కంటే, ఏపీకే ఎక్కువ సాయం అందిస్తోంది.

ఇద్దరికీ రాజకీయంగా టీడీపీనే ఉమ్మడి శత్రువు. అయితే, ఇటు కేసీఆర్ కూడా జగన్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ, సీమ వాసులు మాత్రం.. జగన్ సర్కారుకు దన్నుగా నిలిచిన బీజేపీ వైపే మొగ్గు చూపారు. దానితో హైదరాబాద్‌లో నివసించే మెజారిటీ సీమ వాసులు, కచ్చితంగా కమలానికే ఓటేస్తారన్న భావన నిన్నటి వరకూ ఉండేది.
 
కానీ, హటాత్తుగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి తల్లకిందులయింది. ‘గతంలో ఒకాయన ఇట్లాగే మాట్లాడి అట్లాగే పోయాడని’ వైఎస్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. వైఎస్ అభిమానుల ఆగ్రహానికి గురిచేసింది. అది హైదరాబాద్‌లోని సీమవాసులు, ప్రధానంగా వైఎస్ అభిమానులకు బీజేపీ శత్రువుగా మార్చింది.

అంతకుముందువరకూ.. ఏపీలో జగన్‌కు దన్నుగా నిలుస్తున్నందున, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలన్న సీమవాసుల నిర్ణయం.. రఘునందన్‌రావు వ్యాఖ్యల కారణంగా, ఒక్కసారిగా మార్చుకోవలసి వచ్చిందని చెబుతున్నారు. అయితే, తన వ్యాఖ్యలపై రఘునందన్‌రావు దిద్దుబాటుకు దిగి, విచారం వ్యక్తం చేసినప్పటికీ…అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. 
 
అంతకుముందు… పవన్ కల్యాణ్‌తో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ కావడం కూడా సీమవాసులకు రుచించలేదని, వారి మాటలబట్టి అర్థమవుతోంది. చంద్రబాబుతో సమానంగా, జగన్‌ను దారుణంగా విమర్శించే పవన్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని సీమవాసులు సహించలేకపోతున్నారు.

జనసేన-బీజేపీ కలసి పోటీచేస్తుందని, ఆ మేరకు బీజేపీ నేతలు పవన్‌తో చర్చించేందుకు వస్తున్నారన్న జనసేన లీకు, కమలం కొంపముంచింది. అంతకుముందే.. తెలంగాణలో జనసేనతో బీజేపీకి ఎలాంటి పొత్తు లేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు.

అయితే సంజయ్‌కు సమాచారం లేకుండానే, కిషన్‌రెడ్డి పార్టీ నేత లక్ష్మణ్‌ను వెంటబెట్టుకుని పవన్ వద్దకు వెళ్లి, జనసేన మద్దతు అర్ధించడం కూడా కమలంలో గందరగోళానికి దారితీసింది. జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే పవన్‌తో, బీజేపీ జతకట్టడం కూడా కమలంపై సీమవాసుల కోపానికి మరో కారణమంటున్నారు.
 
దివంగత వైఎస్‌పై రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు వైఎస్ అభిమానులను ఉడికించాయి. దానితో తమ ఆగ్రహాన్ని, సోషల్ మీడియాలో వివిధ రూపాల్లో ప్రదర్శించారు. రఘునందన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.‘ నీ స్థాయికి వైఎస్‌ను విమరించేంత పెద్దోడివా’ అంటూ విమర్శల వర్షం కురిపించారు.

ఈ ఘటన తర్వాతనే.. నగరంలోని రెడ్డి ప్రముఖులు తమ వాట్సాప్ గ్రూపుల ద్వారానే, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్న సందేశాలు పంపడం ప్రారంభించడం ప్రస్తావనార్హం. శేరిలింగంపల్లి, సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, మలక్‌పేట, ఉప్పల్, సికింద్రాబాద్, అంబర్‌పేట వంటి నియోజకవర్గాల్లో సీమవాసులు ఎక్కువ సంఖ్యలో ఉండటం ప్రస్తావనార్హం.