గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (15:28 IST)

గుండెపోటుతో గర్భిణి మృతి.. ఎక్కడ?

woman
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన జరిగింది. గుండెపోటుతో ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కాచిగూడ పరిధిలోని సంజీవయ్య నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ తిలక్ నగర్‌కు చెందిన హేమంత్ - కల్పన అనే దంపతులు ఉన్నారు. భర్త ప్రైవేటు కంపెనీలో పని చేస్తుంటే భార్య ఇంట్లోనే ఉండేది. వీరిద్దరికీ గత యేడాది వివాహం జరిగింది. ఈ క్రమంలో కల్పన గర్భందాల్చగా, సీమంతం కోసం కాచిగూడలోని సంజీవయ్య నగర్‌లో ఉన్న పుట్టింటికి వెళ్లింది. గత 15 రోజులుగా ఇక్కడే ఉంటుంది. అయితే, గురువారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన కల్పన కాలుజారి కిందపడింది. 
 
దీంతో తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా, ఒక్కసారిగా ఫిట్స్‌తో పాటు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయింది. ముందే గర్భవతి కావడం దీనికితోడు ఆమెకు గుండెపోటు రావడంతో కడుపులో బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో హేమంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.