రాష్ట్రపతి ఎన్నికలు : పొరపాటు చేసిన ఎమ్మెల్యే సీతక్క
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలోభాగంగా, సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాంటివారిలో ఎమ్మెల్యే సీతక్క ఒకరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె పొరపాటు విపక్షాలు బలపరిచిన అభ్యర్థికికాకుండా, బీజేపీలోని ఎన్డీయే కూటమి తరపున పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్టు ప్రచారం జరిగింది.
దీనిపై సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను పెన్ను తీస్తుంటే పొరపాటున బ్యాలెట్ పేపర్ వైభాగం అంచు మీద గీత పడిందని, ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, వేరే బ్యాలెట్ పత్రం ఇవ్వాలని కోరగా అందుకు వారు నిరాకరించినట్టు చెప్పారు.
అయితే, ఆత్మసాక్షిగా తాను వేయాల్సిన వారికే ఓటు వేశానని, అయితే, ఆ గీత వల్ల ఏదైనా సమస్య ఉత్పన్నమవుతుందేమోననే అనుమానంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అయితే, తాను వేసిన ఓటు చెల్లుతుందో లేదో తనకు తెలియదని చెప్పారు.