ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (18:46 IST)

తెలంగాణాలో రేపు - ఎల్లుండి వడగళ్ల వర్షం - హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన

rain
తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వడగళ్ల వర్షం కురవనుంది. ముఖ్యంగా, పలు జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రెండు రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేరకు ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పగలు ఎండ, ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు, సాయంత్రానికి భారీ వర్షం పడుతుంది. బుధ, గురువారాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు, శుక్ర, శనివారాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ ఆలెర్ట్‌ను జారీచేసింది. 
 
ఆదిలాబాద్, జిగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపెట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వడగళ్ల వాన పొంచివుండటంతో రైతులు తమ పంటలను కాపాడుకునే ప్రయత్న చేయాలని వాతావరణ శాఖ సూచన చేసింది. 
 
మరోవైపు, గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. పలుచోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతున్న నగరజీవులకు ఈ వర్షం ఉపశమనం కలిగిలించింది. సైదాబాద్, అంబర్ పేట, కాచిగూడ, ఉప్పల్, మల్లాపూర్, నల్లకుంట, లాలాపేట్, నాచారం, హబ్సిగూడ, గోషా మహల్, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, రామ్ నగర్, సుల్తాన్ బజార్, గాంధీ నగర్, విద్యా నగర్, ముషీరాబాద్, చిలకలగూడ, కవాడిగూడ, అడిక్ మెట్, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్యారడైజ్, రామ్ గోపాల పేట, భన్సీలాల్ పేట, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా ఉప్పల్ వెళ్లే రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.