తెలంగాణ ప్రజలకు శుభవార్త - మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు ఎండకు తల్లడిల్లిపోతున్నారు. అనేక మంది వడదెబ్బకు అస్వస్థతకు లోనవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణాలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది.
ఉత్తర తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలపై తీవ్రమైన వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుంది పేర్కొంది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లవద్దని సూచించింది.
ఇదిలావుంటే, ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియల్ కర్నాటక మీదుగా దక్షిణ ఇంటీరియల్ కర్నాటక వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని చెప్పారు. ఈ ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తద్వారా ఎండల తీవ్రత నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.