1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (19:42 IST)

సాయిధరమ్ తేజ్‌‌కు రోడ్డు ప్రమాదం : అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు అపరాధం

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్‌ ఇటీవల మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి వంతెనకు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. 
 
స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపుతప్పి కిందపడ్డాడు. హెల్మెట్ ధరించడంతో సాయితేజ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని గాయాలపాలయ్యాడు. రోడ్డుపై ఇసుక, మట్టి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారణ అయింది. 
 
దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేల్కొంది. ప్రత్యేక చర్యలు చేపడుతూ రోడ్లన్నింటినీ శుభ్రం చేయిస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ కొరడా ఝులిపిస్తోంది. 
 
మాదాపూర్ ఖానామెట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్‌స్ట్రక్షన్‌కు జీహెచ్‌ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆ సంస్థ చేస్తున్న నిర్మాణ పనుల వల్ల మట్టి, ఇసుక రోడ్లపై పడుతుండడంతో జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు సత్వర చర్యలు తీసుకున్నారు.