మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (21:48 IST)

పాము కరిస్తే.. నాటు వైద్యం చేశారు.. కడుపు నొప్పి అని నిర్లక్ష్యం చివరికి?

ఓ పాము అన్నదమ్ములను కాటేసింది. ఈ ఘటనలో అన్న మృతిచెందగా తమ్ముడి పరిస్థితి విషమంగా వుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని దౌలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడు రాంచరణ్‌(10) స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. రాంచరణ్ తన తమ్ముడు నరసింహులు(7), సోదరి శృతి, తండ్రి నారాయణ, తల్లి కేశమ్మతో కలిసి ఇంట్లో నేలపై పడుకున్నాడు. నిద్ర నుంచి లేవడంతోనే రాంచరణ్ కడుపునొప్పిగా ఉందని పేర్కొన్నాడు.
 
దుప్పటిని దులిపి చూడగా అందులో విషపూరిత పాము కనిపించింది. నర్సింహులు సైతం నొప్పిగా ఉందని తెలిపాడు. సమస్య తీవ్రత తెలియని తల్లిదండ్రులు ఇద్దరిని సమీప గ్రామం రామతీర్థంలోని నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు.
 
పరిస్థితి విషమించడంతో చిన్నారులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు అన్నదమ్ములను ఇద్దరినీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమాద్యలోనే రాంచరణ్ చనిపోయాడు. నరసింహులు ప్రాణాలతో పోరాడుతున్నాడు. జరిగిన ఘటనపై పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు.