బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (14:34 IST)

గొర్రెకుంట 9 మంది హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్ తీర్పు ప్రకటించారు. 
 
గత మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్ బావిలో పడేశాడు. తెల్లారేసరికి 9 మంది మృతదేహాలను పోలీసులు బయటకుతీశారు. 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. 57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షంవ్యక్తమవుతోంది.
 
కాగా, ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గోనె సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. 
 
లాక్డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉంటోంది. భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్ద ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్న పైభవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. 
 
ఇక నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జ‌రిగాయి. ఇక ఇంటిపై ఉంటున్న శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారం తొమ్మిది మందిని హతమార్చాడు.
 
సంజయ్ కుమార్ చంపెసిన వారిలో మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం (45), కూతురు బుష్రా ఖాతూన్ ‌(20), మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం (19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21), శ్రీరాం కుమార్‌షా (26) , మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్ ‌(30) అనే డ్రైవర్ ఉన్నారు.