శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (11:14 IST)

కాశ్మీర్‌లో తెలంగాణ జవాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

తెలంగాణ ప్రాంతానికి చెందిన జవాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల గాల్వాన్ లోయలో చైనా బలగాలు జరిపిన దాడిలో తెలంగాణాకు చెందిన కల్నల్ సురేష్ బాబు వీరమరణం చెందిన విషయం తెల్సిందే. ఈ విషాదకర సంఘటన మరచిపోకముందే ఆదివారం శ్రీనగర్ సమీపంలో పెద్దపల్లి జిల్లా నాగెపల్లి గ్రామానికి చెందిన శాలిగాం శ్రీనివాస్ (28) బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఏడేళ్ళ క్రితం సైన్యంలో చేరిన శ్రీనివాస్, వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించి, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిధిలోని సరిహద్దుల్లో విధుల్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున తన సర్వీస్ తుపాకీతో శ్రీనివాస్ కాల్చుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను సహచర జవాన్లు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కాగా, కరోనా మహమ్మారి విజృంభించడానికి ముందు స్వగ్రామానికి వచ్చిన శ్రీనివాస్, లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత జూన్ 4న విధులకు వెళ్లి, 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి, తనలో వైరస్ లేదని నిర్ధారించుకుని విధుల్లో చేరి, ఇలా హఠాన్మరణం చెందడం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. 
 
శ్రీనివాస్‌కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమైంది. అతని మృతి విషయం తెలుసుకున్న నాగెపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ కుటుంబాన్ని పలువురు పరామర్శిస్తున్నారు. అతని మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.