గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (09:22 IST)

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపై పడిన లారీలు

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగానగర్ గోదావరి దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొట్టి పక్కనే వెళుతున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో దంపతులు, చిన్నారి వుంది. మరో చిన్నారి మాత్రం మృత్యువు నుంచి బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండానికి చెందిన షేక్ షకిల్, అతని భార్య రేష్మ, తన ఇద్దరు పిల్లలు కలిసి మంచిర్యాల జిల్లా ఇందారంలో తమ బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి ఒక ఆటోలో బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. 
 
ఈ ఆటో గంగానగర్ వద్ద ఫ్లైఓవర్ యూటర్న్ చేస్తున్న సమయంలో బోగ్గులారీని ఫ్లైఓవర్ నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో లారీ పక్క నుంచి ఆటో వెళుతున్నది. రెండు లారీలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న లారీపై పడింది. ఈ ఘటనలో దంపతులతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.