శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:50 IST)

దసరా పండగకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ఈ దసరాకు 4,045 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు.

వాటిలో 3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రద్దీని బట్టి నడుపుతామని వివరించారు.

హైదరాబాద్‌లో ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు.

రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా నడిపించే ఈ ప్రత్యేక బస్సులతో టీఎస్‌ ఆర్టీసీకి రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఏ ప్రాంతాల వారికి ఎక్కడి నుంచి..?
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ వెళ్లే బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నడిపించనున్నట్లు చెప్పారు. అలాగే ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి వరంగల్, పరకాల, మహబూబాబాద్, భువనగిరి, యాదగిరి గుట్టకు వెళ్లే బస్సులుంటాయన్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు బస్సులు ఉంటాయని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాలైన కడప, కర్నూల్, చిత్తూర్, అనంతపూర్, ఒంగోలు, నెల్లూర్‌కు ఓల్డ్ సీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులుంటాయి. మిగితా బస్సులను ఎంజీబీఎస్ నుంచి నడిపించనున్నట్లు చెప్పారు.