శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (11:41 IST)

తెలంగాణాకు మరో మూడు వారాలు వర్ష సూచన - ఆరెంజ్ హెచ్చరిక

rain
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులోభాగంగా, గురు, శుక్రవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే, వచ్చే మూడు వారాల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే ఈ నెల 25వ తేదీ వరకు వర్ష సూచన ప్రభావం ఎలా ఉంటుందనే అంచాలను తాజాగా వెల్లడించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు వారాల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిజానికి నైరుతి రుతపవనాల సీజన్‌లో నమోదు కావాల్సిన వర్షపాతం మూడింట రెండు వంతుల మేర ఒక్క నెలలోనే కురిసింది. దీంతో చెరువులు, కుంటలు చాలా వరకు నిండిపోయాయి. 
 
వాగులు, వంకలతోపాటు కృష్ణా, గోదావరి ప్రధాన నదులు, ఉప నదుల్లోనూ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ భారీ వర్షాలు పడితే.. వరదలతో జన జీవనానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం వానల తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.