శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (09:45 IST)

తెరాసను దేశ వ్యాప్తంగా విస్తరించాలి : కేసీఆర్‌పై పార్టీ నేతల ఒత్తిడి

cmkcr
దేశంలో నెలకొనివున్న రాజకీయ శూన్యతను నివృత్తి చేసేందుకు పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ పార్టీ నేతలు శ్రేణులు తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు వారు పార్టీ అధినేతను కోరారు. 
 
దేశంలోని వర్తమాన రాజకీయాలపై ఆదివారం ఇక్కడ జరిగిన మారథాన్ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సహా నాయకులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. 
 
పార్టీ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. పార్టీ నాయకులు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మరియు దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వివిధ రంగాలకు చెందిన పలువురు మేధావులు తనతో సంభాషించారని సూచించినట్లు తెలిసింది.
 
కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అందించడంలో విఫలమైందని, ఆ పార్టీ నాయకత్వ సమస్యలతో బాధపడుతోందని, ఇంకోవైపు, అధికార బీజేపీకి సరైన విజన్ లేకపోవడం, దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంలో పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా పార్టీ నేతలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 
 
ముఖ్యంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఏకైక ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలివేటువంటిదని, దేశానికి ఏమాత్రం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. 
 
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకోదగిన ఒక్క మంచి పని కూడా చేయలేదని తెరాస నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశం యొక్క అభివృద్ధిని నడిపించే నిబద్ధత పార్టీకి లేదని, దానికి బదులుగా రాజకీయ మైలేజీని పొందేందుకు మతపరమైన విభేదాలను ప్రేరేపించడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందని వారు ఆరోపించారు. 
 
ఇలా పార్టీ నేతలు చేసిన వినతులు, సూచనలను ఆలకించిన సీఎం కేసీఆర్.. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వారికి హామీ ఇచ్చారు. దసరా శుభ సందర్భం కావడంతో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించేందుకు అక్టోబర్ 5వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరినట్లు సమాచారం.