శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (08:56 IST)

అత్యాచార బాధితురాలు గర్భాన్ని తొలగించుకునేందుకు హైకోర్టు సమ్మతం

ఓ కామాంధుడి లైంగికదాడి వల్ల ఓ యువతి అత్యాచారనికి గురైంది. దీంతో ఆ బాధితురాలు గర్భందాల్చింది. అయితే, ఈ గర్భాన్ని తొలగించుకునేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది. బాధిత బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలంటూ కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. అబార్షన్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
 
బాధితురాలి సమీప బంధువు ఈ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. అబార్షన్ చేయాలని కోరగా, కోఠి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో బాధిత బాలిక తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. 
 
విచారించిన హైకోర్టు బాలిక ఆరోగ్య పరిస్థితిపై కమిటీ వేయగా, పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె గర్భంలో 25 వారాల వయసున్న పిండం ఉన్నట్టు నిర్ధారించారు. కొన్ని జాగ్రత్తలతో అబార్షన్ చేయవచ్చని కోర్టుకు కమిటీ తెలిపింది.
 
బాలికకు అనుకూలంగా హైకోర్టు తీర్పునిస్తూ నిపుణుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అబార్షన్ చేయాలని జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. 
 
ఓ దురదృష్టకర ఘటన కారణంగా వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే అది ఆ బాలికపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి కలిగించి, ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
 
పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని, నివేదికను దర్యాప్తు అధికారులకు అందజేయాలని ఆదేశించింది.