కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసే సత్తా యువకులకు ఉంది: విజయశాంతి
కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి. టీఆర్ఎస్‌ను పాతాళానికి తొక్కే రోజు తొందరలోనే ఉందన్నారు. పోరాటాలు చేయకపోతే బానిసబతుకే మిగులుతుందన్నారు.
రాష్ట్రంలో అనిశ్చితి ఉంది.. గందరగోళ పరిస్థితి ఏర్పడి ఉందని, ఒక ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటారా.. నీ తల్లిదండ్రులకోసం పోరాటం చేయరా అంటూ విద్యార్థులనుద్దేశించి ప్రశ్నించారు.
ఆత్మహత్యలు చేసుకోవడం పిరికితనమని.. యువకులకు ఉద్యమ సమయంలో ఉన్న ధైర్యం ఏమైందన్నారు. పిరికితనం కాదు కేసీఆర్ ప్రభుత్వంపైన తిరగబడండని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాల్సిన బాధ్యత కేసీఆర్‌దేనని.. ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. జీతాలు ఇవ్వాల్సి వస్తుందనే నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగస్తులు కూడా నిన్నటివరకు నిరుద్యోగులేనన్నారు. ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు చచ్చిపోతున్నారని.. తెలంగాణ కోసం ఉద్యోగులు జేఏసీగా పోరాడారన్నారు.
నిరుద్యోగులు చనిపోతున్నా వారికి ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు మేం పోరాటం చేస్తామన్నారు. ఆత్మహత్యలు చేసుకోకండని.. పోరాటం చేద్దామన్నారు విజయశాంతి. ప్రభుత్వాన్ని కూలదోసే సత్తా యువకులకు ఉందని.. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌ను పాతాళానికి తొక్కే సమయం ఆసన్నమైందన్నారు.