టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం
తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్ పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని గుర్తుచేస్తూ టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.