మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By srinivas
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (14:50 IST)

వీఆర్వో పరీక్ష రాయాలంటే తాళిబొట్టు తీయాలా?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వీఆర్వో రాత పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర జిల్లాల అభ్యర్థులు హైదరాబాద్ రావడానికి సమయానికి బస్సులు ల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం వీఆర్వో రాత పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇతర జిల్లాల అభ్యర్థులు హైదరాబాద్ రావడానికి సమయానికి బస్సులు లేకపోవడంతో అసహనానికి గురయ్యారు. ఇదిలాఉంటే పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళా అభ్యర్ధులు పట్ల మెదక్ జిల్లా నర్సాపూర్ లిటిల్ ప్లవర్ పాఠశాల యాజమాన్యం అనుచితంగా ప్రవర్తించింది.
 
పరీక్ష హాలులోకి అనుమతించాలంటే తాళిబొట్టు తీయాలని, మెట్టెలను ధరించవద్దని హుకుం జారీ చేసింది. దీంతో మహిళా అభ్యర్ధులు వాటిని తీసి తమ వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఇంకొందరు తాళిబొట్టు, మెట్టెలు తీయబోమనీ, ఇది తమ సంప్రదాయాలకు విరుద్ధమని పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. పరీక్ష రాయడానికి వస్తే ఈ పిచ్చి నిబంధనలు ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తాళిబొట్టు, మెట్టెలపై ఎటువంటి నిబంధనలు లేవని టీపీపీఎస్సీ గతంలో స్పష్టంగా ప్రకటించినా, సదరు పరీక్ష కేంద్రంలో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించామని, అయితే స్కూల్ యాజమాన్యానికి తెలియక ఇటువంటి పొరబాటు జరిగిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరక తగు చర్యలు తీసుకుంటాం అంటున్నారు మెదక్ జిల్లా సంయుక్త పాలనాధికారి నగేష్.