శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

తెరాస ఎమ్మెల్యే రసమయిపై చెప్పుల దాడి - ఉద్రిక్తత

Rasamayi
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పలు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాజాగా మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్‌పై చెప్పులదాడి జరిగింది. గుండ్లపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దీక్ష చేస్తున్న యువకులను చూసిన ఆయన ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన యువకులు ఆయన కాన్వాయ్‌పై చెప్పులు విసిరేశారు. దీంతో పోలీసులు యువకులపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా గుండ్లవల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గత తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి బాలకిషన్ కీలక భూమికను పోషించారు. ఆ తర్వాత ఆయన తెరాసలో చేరి కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో గన్నేరువరం మండలంలో పలు గ్రామాలకు చెందిన యువకులు తమకు డబుల్ లైనుతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నిరాహారదీక్షకు దిగారు. 
 
ఆదివారం ఆ ధర్నా శిబిరం మీదుగా వెళుతున్న రసమయని నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, రసమయి కాన్వాయ్‌ని ఆపకుండానే ముందుకుసాగారు. దీంతో కనీసం తమకు సమాధానం కూడా చెప్పరా అంటూ రసమయి కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి యత్నించారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత గన్నేరువరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రసమయి తనపై దాడికి యత్నించిన యువకులపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు.