మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (12:46 IST)

'దేవర' చిత్ర నిర్మాతలకు దసరా బొనంజా.. రూ.60 టిక్కెట్ రూ.135కు పెంపు!!

devara movie
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ నెల 27వ తేదీన విడుదలకానుంది. ఇందుకోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో ఈ చిత్ర టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే వారం రోజుల పాటు అదనపు షోలు వేసుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. 
 
ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110లు, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 9 రోజుల పాటు రోజుకు అయిదు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిలీజ్ రోజున మాత్రం ఆరు షోలకు అనుమతించింది. ఈ షోను అర్థరాత్రి 12 గంటల నుంచి ప్రదర్శించుకోవచ్చు. 
 
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలియజేశారు. తన వ్యక్తిగత ఎక్స్ (ట్విట్టర్ ఖాతాలో కల్యాణ్ రామ్.. ప్రభుత్వానికి, సీఎం నారా చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌‍లకు ధన్యవాదాలు తెలియజేశారు.