గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (10:58 IST)

జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తుంటారు : ఏఆర్ రెహ్మాన్

AR Rahman
AR Rahman
ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ జీవితంలో ఏదో కోల్పోయామనే భ్రమలో జీవిస్తుంటారని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. రెహ్మాన్ దంపతులు ఇటీవల విడాకుల ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఈ ప్రకటన తర్వాత ఆయన తొలిసారి ఓ వేదికపై కనిపించారు. 
 
గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుక ముగింపు వేడుకలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంతోమంది ఎదుర్కొంటున్న డిప్రెషన్ సమస్య గురించి ఆయన ఈ వేదికపై మాట్లాడుతూ, శారీరక అవసరాలపై శ్రద్ధ చూపడం మానేయాలని రెహమాన్ సలహా ఇచ్చారు. 'ఈరోజుల్లో చాలామంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. 
 
ఎందుకంటే వారు జీవితంలో ఏదో ముఖ్యమైన దాన్ని కోల్పోయామనే భావనలో ఉంటున్నారు. జీవితమంతా శూన్యంగా మారిందనే భ్రమలో జీవిస్తున్నారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియడం లేదు. చదవడం, రాయడం లేదా మనకు ఇష్టమైన సంగీతం వినడం లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది' అని తెలిపారు.
 
తన యవ్వనంలో వచ్చిన ఆత్మహత్య ఆలోచనల గురించి రెహ్మాన్ ఈ వేదికపై పంచుకున్నారు. ఆ సమయంలో తన తల్లి ఇచ్చిన సలహా జీవితాన్ని మార్చేసిందన్నారు. 'మనం ఇతరుల కోసం జీవించినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు రావు' అని తన తల్లి సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. అప్పటినుంచి తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందన్నారు. 
 
జీవితంలో అందుకున్న అత్యంత అందమైన, గొప్ప సలహా ఇదేనన్నారు. ఈ మాటలు తన జీవితానికి లోతైన అర్థాన్ని ఇచ్చాయని.. మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో సహాయపడ్డాయని రెహ్మాన్ పేర్కొన్నారు. అదేసమయంలో తమ విడాకుల అంశంపై కూడా ఆయన నోరు విప్పారు. విడిపోవాలనే నిర్ణయం పరస్పర అంగీకారంతోనే తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని తెలిపారు.