గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జులై 2020 (13:00 IST)

'బిగ్ బి' ఫ్యామిలీలో నలుగురికి పాజిటివ్ - కంటైన్మెంట్ జోన్‌గా జల్సా (video)

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో వారు నివసించే అధికారిక నివాసమైన జల్సా బంగళాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. 
 
77 యేళ్ల సూపర్ స్టార్ అమితాబ్‌తో పాటు.. ఆయన అభిషేక్ బచ్చన్‌లకు శనివారం రాత్రి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేర్చారు.
 
ఇదిలావుండగా అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్, మనుమరాలు ఆరాధ్య, భార్య జయాబచ్చన్‌లకు కరోనా పరీక్షలు చేయగా, వీరిలో కోడలు, కుమార్తెకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇప్పుడు వీరిద్ద‌రూ కూడా నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌ట‌. మిగిలిన కుటుంబ స‌భ్యులు జ‌య‌బచ్చన్, ఆగ‌స్య నందా, న‌వ్య‌ల‌కు నెగ‌టివ్ టెస్ట్ రిపోర్ట్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 
 
 
ఇదిలావుండగా, కరోనా బారినపడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ ట్విట్టర్‌లో స్పందించారు. అమితాబ్, అభిషేక్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. 
 
"లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ సంపూర్ణ ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను" అంటూ కేపీ ఓలీ ట్వీట్ చేశారు. భారత్, నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న సమయంలో కేపీ ఓలీ భారత నటుడి కోసం ట్వీట్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది.
 
ఇటీవలే భారత్ భూభాగంలోని లింపియధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ నేపాల్ ఆ ప్రాంతాలతో సరికొత్త మ్యాప్‌ను పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. దీనిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.