1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (18:36 IST)

'ప్రజలు ఎన్నుకున్న వెధవలు వారు' ... జగన్ సర్కారును టార్గెట్ చేసిన "వీరసింహారెడ్డి"

veerasimhareddy
నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని. పక్కా మాస్ చిత్రంగా, బాలకృష్ణ హీరోయిజానికి తగినట్టుగా రూపొందించారు. శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ అందులోని అనేక డైలాగులు ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాసినవిగా ఉన్నాయనే ప్రచారం మాత్రం బాగానే సాగుతోంది. 
 
ఈ చిత్రంలో వీరసింహారెడ్డి (బాలకృష్ణ) రాయలసీమ ప్రజల పక్షాన నిలుస్తూ పోరు సాగిస్తూ ఉంటాడు. ఆయనకు ఓ సారి హోం మంత్రి నుంచి 'ఒకసారి వచ్చి కలవమని' కబురు వస్తుంది. అపుడు బాలయ్య పక్కనే ఉన్న ఆయన అనుచరుడు.. 'నువ్వు వెళ్లడం ఏంటి పెద్దయ్య' అని అంటాడు. దీనికి వీరసింహారెడ్డి.. "ప్రజలు ఎన్నుకున్న వెధవలు వాళ్ళు. గౌరవించడం మన ధర్మం. బాధ్యత" అని చెప్తాడు. ఈ డైలాగ్ ఖచ్చితంగా వైఎస్. జగన్‌ను ఉద్దేశించి రాసిందే. 
 
గతంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినిమా టిక్కెట్ల ధరలు, ఇంకా ఇతర కారణాల కోసం జగన్‌ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు. అప్పట్లో వీరంతా జగన్ కాళ్ళు పట్టుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. జగన్‌ను కలిసినవారిలో బాలకృష్ణ లేరు. 
 
అలాగే, మరో చోట... 'సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు' అని బాలకృష్ణ చెబుతాడు. ఈ డైలాగ్ ఇలా రాయడానికి కూడా బలమైన కారణం ఉంది. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని టార్గెట్ చేస్తూ ఈ డైలాగ్ రాసినట్టుగా ఉంది. ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ అద్భుతంగా మాటలు రాశారని చెప్పొచ్చు.