మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 డిశెంబరు 2020 (09:09 IST)

న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న 'చిత్రం X' గ్రాండ్‌గా రిలీజ్

బేబీ రాజశ్రీ సమర్పణలో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ్ బాల, మానస హీరో హీరోయిన్లుగా రమేష్ విభూది దర్శకత్వంలో.. నిర్మాత పొలం గోవిందయ్య నిర్మించిన మూవీ "చిత్రం X". ఈ చిత్ర సెకండ్ టైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో సీనియర్ దర్శకుడు సాగర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో, దర్శకనిర్మాతలతో పాటు సునీల్ రావినూతల, కెమెరామెన్ ప్రవీణ్ తదితరులు పాల్గొనగా.. దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని నూతన సంవత్సర కానుకగా.. జనవరి 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. 
 
ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు సాగర్ మాట్లాడుతూ, ‘‘తక్కువ బడ్జెట్‌లో ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడిని అభినందించాలి. కథను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. జనరల్‌గా జనవరి ఫస్ట్ వీక్‌లో చాలా సినిమాలు ఉన్నా జనవరి 1, 2021న విడుదల అవుతున్న ఈ "చిత్రం X" గతంలో విడుదలై ఘన విజయం సాధించిన "చిత్రం" సినిమా అంత పెద్ద విజయం సాధించాలి. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
 
నిర్మాత మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు చెప్పిన కథ ఇంట్రెస్ట్‌గా అనిపించి ఈ సినిమా చేయడం జరిగింది. తక్కువ బడ్జెట్‌లో తీసినా.. మా సినిమా చాలా బాగా వచ్చింది. మూడు నెలల క్రితం చిత్ర మొదటి ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ చేత విడుదల చేయడం జరిగింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మా రెండవ ట్రైలర్‌ను దర్శకుడు సాగర్ విడుదల చేసి మా టీంను ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది అనే నమ్మకం మాకుంది. ఈ చిత్రం చూసిన మీరందరూ మా టీంను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
 
దర్శకుడు రమేష్ విభూధి మాట్లాడుతూ, ‘‘1999 నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే పెద్ద పెద్ద వారిని కూడా కలిసి కథలు చెప్పడం జరిగింది. ఫైవ్ ఇయర్స్ నుంచి నేను డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను.. కానీ పరిస్థితులు అనుకూలించక ఈ రోజు వరకు కూడా నాకు అవకాశం రాలేదు. తర్వాత గోవింద్‌‌కి ఈ కథ చెప్పడంతో ఆయనకు నచ్చి వెంటనే ఈ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం కల్పించారు. వారికి నా కృతజ్ఞతలు. గోవింద్‌ నాకిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పుడు ఈ సినిమా ‘చిత్రం X’ చేయగలిగాను. 
 
ఒక డీప్ ఫారెస్ట్‌లో నేను అనుకున్న బడ్జెట్‌లోనే సింగిల్ షెడ్యూల్‌లో సినిమా మొత్తం 30 రోజుల్లో ప్లాన్ చేసి 33 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. అనుకున్నది అనుకున్నట్లు నాకు ఇచ్చిన బడ్జెట్‌లో మూవీ చక్కగా తీశాము. కొత్త సంవత్సరం జనవరిలో ఈ చిత్రం మీ ముందుకు రాబోతుంది. మమ్మల్ని మన్నించి మా ట్రైలర్ విడుదల చేసిన మా గురువు సాగర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాను మీరందరూ చూసి మా టీమ్‌ను ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
 
ఇందులో రాజ్ బాల, మానస హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి, ఆనంద్, వినోద్, 150 రఫీ, చందన, వాణి, కావ్య, కల్పన తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, పీఆర్వో: బిఎస్.వీరబాబు, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్, నిర్మాత: పొలం గోవిందయ్య, దర్శకత్వం: రమేష్ వీభూది.