కెరీర్ ఆరంభంలో ఎన్నో ఎదురు దెబ్బలు తప్పవు : కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన పలు చేదు అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా, కేరీర్ ఆరంభంలో, పైకి ఎదిగే క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తప్పవని అన్నారు. తాజాగా ఆమె ఓ మీడియాతో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఎన్నో చేదు అనుభవాలను వివరించారు.
'నేను ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇది. అప్పట్లో మోడలింగ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేదాన్ని. నా అదృష్టం కొద్దీ ఒకేసారి 'వన్ నేనొక్కడినే' 'హీరోపంతీ' అనే రెండు సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. మరికొద్ది రోజుల్లో మూవీ చిత్రీకరణ మొదలవుతుందనగా ఓ ర్యాంప్ షోలో పాల్గొనేందుకు వెళ్లా. పచ్చికలా ఉన్న లాన్లో క్యాట్ వాక్ చేస్తున్నా. ఉన్నట్టుండి నేను వేసుకున్న హీల్స్ మడమలు నేలలోకి దిగబడిపోయాయి.
దీంతో, ఒక్కసారిగా ఆందోళన చెందిన గందరగోళానికి లోనయ్యాను. పైగా, మధ్యలోనే ఆగిపోవడంతో.. ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ వెంటనే గట్టిగా అరుస్తూ.. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆ పక్కకి వెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఆ తర్వాత మళ్లీ ఆమెతో కలిసి పనిచేయలేదు' అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల 'ఆదిపురుష్' చిత్రంలో ఆమె సీతగా కనిపించిన విషయం తెల్సిందే.