మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (17:42 IST)

ఏపిలో ప్రజల వద్దకు సినిమా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లక్ష్యం : గౌతమ్‌ రెడ్డి

Gautham Reddy, Posani Krishna Murali, C Kalyan, Ali, Tummalapally Rama Satyanarayana
Gautham Reddy, Posani Krishna Murali, C Kalyan, Ali, Tummalapally Rama Satyanarayana
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే ఛాన్స్‌ ఏపీ ఫైబర్‌ నెట్‌ కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు "ప్రజల వద్దకు సినిమా" తీసుకు వస్తున్నామని ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి అన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కూడా రిలీజ్‌ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ... "భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నాం. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదు. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్‌ అయింది. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం లభిస్తుందన్నారు.
 
ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. "ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో.. అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్‌లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.
 
ఏపీ ఎలక్రానిక్ మీడియా అడ్వైజర్ - ప్రముఖ నటుడు అలీ మాట్లాడుతూ... 'ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండస్ట్రీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము? పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్‌లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్‌లో కచ్చితంగా రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను" అన్నారు.
 
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ... 'ఏపీ ప్రభుత్వం నియమించిన పోసాని అలీ, జోగినాయుడు వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్‌లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు జగన్ గారిచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈరోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్‌ఫామ్‌. ఏపీ సీఎం జగన్  విజన్ చాలా పెద్దది. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ ఇండస్ట్రీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అన్నారు.
 
ఏపీ కల్చరల్ కమిటీ క్రియేటివ్ హెడ్ జోగినాయుడు మాట్లాడుతూ... ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా వై.ఎస్.జగన్ గారు మన చిత్ర పరిశ్రమ కోసం ఎంతో కృషి చేస్తున్నారు" అన్నారు.
 
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ... రిలీజ్ రోజే సినిమాలను ఫైబర్ నెట్ లో ప్రసారం చేసే ఈ విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని చిత్ర పరిశ్రమకు... ముఖ్యమంత్రి జగన్ గారు అందిస్తున్న "పదో రత్నం"గా పేర్కొన్నారు.