సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జులై 2023 (18:41 IST)

బ్రో సినిమా ఎలా వుందో తెలుసా ` రివ్యూ

Bro poster
Bro poster
నటీనటులు: పవన్‌ కళ్యాణ్‌, సాయితేజ్‌, కేతిక శర్మ, ప్రియా వారియర్‌, రోహినీ, తనికెళ్ళ భరణి, కిషోర్‌ రాజా తదితరులు
 
సాంకేతికత: కెమెరా: సుజీత్‌ వాసుదేవ్‌, సంగీతం: థమన్‌, స్క్రీన్‌ప్లే మాటలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, మూలకథ: వినోదయ సిత్రం (తమిళం), నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్‌, కథ, దర్శకత్వం: సముద్రఖని
 
పవన్‌కళ్యాణ్‌, సాయితేజ్‌ సినిమా అనగానే క్రేజ్‌ ఏర్పడింది. సాయితేజ్‌కు ప్రమాదం జరిగాక విరూపాక్ష సినిమా చేశాడు. అది సక్సెస్‌ అయింది. ఆ తర్వాత ఎలాంటి కథతో చేయాలనే డైలమాలో వుండగా టైంకలిసి వచ్చినట్లు సముద్రఖని రూపంలో తమిళంలో ఆల్‌రెడీ ఆయనే దర్శకత్వం వహించి, టైం దేవుడు పాత్రను తనే పోషించాడు. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌‌ని పెట్టారు. త్రివిక్రమ్‌ కూడా మాటలు కలపడంతో ఒక రూపం వచ్చింది.. ఈ సినిమా నేడే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ:
హైదరాబాద్‌ సిటీలో మార్కండేయులు అలియాస్‌ మార్క్‌ (సాయిధరమ్‌తేజ్‌)కు తల్లి, ఇద్దరు చెల్లెల్లు, అమెరికాలో జాబ్‌ చేసుకునే తమ్ముడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పెట్టుకుంటాడు. ఆ క్రమంలో అందరూ తన మాటే వినాలనే చాదస్తంలా వుంటాడు. అచ్చు నాన్నలా ప్రవర్తిస్తున్నాడని చెల్లెళ్లు అనుకుంటుంటారు. మార్క్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. కంపెనీకి తనే మూలస్తంభం అని అన్నీ టైం ప్రకారం చకచకా జరిగిపోవాలనీ, అందరూ తనమాట వినాలనే రకం. 
 
ఓసారి కంపెనీ పనిమీద వైజాగ్‌ వెళ్ళి తిరిగివస్తుండగా కారు ప్రమాదంలో చనిపోతాడు. అప్పుడు మార్క్‌కు కాలదేవుడు (పవన్‌కళ్యాణ్‌) కనిపిస్తాడు. తను లేకపోతే తన కుటుంబం, కంపెనీ ఏమయిపోతాయోనని కంగారుపడిపోతుంటాడు. అలాంటి స్థితిలో 90రోజులుపాటు జీవితాన్ని ఇచ్చేలా చిటెకలో మార్చేస్తాడు దేవుడు. కానీ నీతోపాటు నేనూ తోడుగా వుంటానని కాలదేవుడు షరతు పెట్టడంతో ఓకే అంటాడు. అలా ఇద్దరూ మార్క్‌ ఇంటికి వచ్చి ఆగిపోయిన పనులు పూర్తిచేసేలా అవకాశం కల్పిస్తాడు. కానీ అక్కడే ట్విస్ట్‌ వుంటుంది. అది ఏమిటి? ఇంతచేసి భూమి మీదకు వచ్చిన మార్క్‌కు ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేది మిగిలి సినిమా.
 
సమీక్ష:
దేవుడు, భక్తుడు అనే కాన్సెప్ట్‌తో గోపాల గోపాల సినిమా చూశాం. ఆ తర్వాత వెంకటేష్‌, విశ్వక్‌సేన్‌తో మరో సినిమా కూడా వచ్చింది. గతంలో దేవుడు భక్తుడు సినిమాలు కూడా వచ్చాయి. కానీ వాటిలో లేని కాన్సెప్ట్‌ ఇందులో వుంది. ఇందులోని పాయింట్‌ ఓ నాటకం స్పూర్తి. తమిళ దర్శకుడు బాలచందర్‌తో కలిసి సముద్రఖని ఓ నాటకాన్ని చెన్నైలో చూశారు. అది ఆయన మనసులో ఘాటుగా నాటుకుపోయింది. దాన్ని సినిమాగా తీయాలని రకరకాల ప్లాన్స్‌ వేశారు. అంతకుముందు ఏవో సినిమాలు చేసి ఆఖరికి తమిళంలోనే వినోదం సిత్తం అనే సినిమా తీశాడు. అది బాగా ఆడింది. దాన్నే ఇప్పుడు తెలుగులో బ్రోగా తీయడం మొదటిసారి.
 
వపన్‌ కళ్యాణ్‌ కు రీమేక్‌లు కొత్తేమీకాదు. హిందీ పింక్‌ను వకీల్‌సాబ్‌గా, మలయాళం నుంచి అయ్యప్పం కోషియం సినిమా ఆధారంగా భీమ్లా నాయక్‌ చేశాడు. ఇప్పుడు ఇది మూడోది. ఇందులో పవన్‌ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా. పొలిటికల్‌ వ్యవవహారాల్లో బిజీగా వుండడంతో ఆ తరహా డైలాగ్‌లు వున్నా అవి ఏ పార్టీకీ, ఏ వ్యక్తిని ఉద్దేశించి కాకుండా ప్రతి మనిషికీ కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. 
 
త్రివిక్రమ్‌ మార్క్‌ ఇందులో కనిపించింది. ‘మేం పెట్టిపుట్టామని చాలామంది తాము చేసిందే రైట్‌ అంటూ తరతరాలుగా సంపాదిస్తూ అన్నీ తాము చేసిందే న్యాయం అనేవారిని నేను వదలను. ఏమీ లేనివాడిని నేను వదలను. మనిషి పుట్టాక చావు కూడా వుంటుంది. అది తెలుసుకుని బతికితే చచ్చినా బతికున్నట్లు’ అని సందర్భోచితంగా రాసిన మాటలు బాగున్నాయి. అదేవిధంగా నేను లేకపోతే మా కుటుంబం, నా కంపెనీ ఏమవుతుందో అని బెంగపడినవాడికి.. అన్నీ వాటంతటవే టైం ప్రకారం జరిగిపోతాయి. నవ్వు వున్నా లేకున్నా జరగాల్సినవన్నీ జరుగుతాయి. అంటూ మరో సందర్భంలో చెప్పిన సంభాషణలు పెద్ద తరాన్ని ఆకట్టుకుంటాయి. 
 
ఎవడికో రావాల్సిన ఉద్యోగాన్ని రానీయకుండా అడ్డుపడి ఆ ఉద్యోగాన్ని ఇతను పొందితే, భస్మాసురుడిలా మనుషులు తమను తాము నాశనం చేసుకుంటున్నారనే లాజిక్‌తో వున్న ఓ సీన్‌ హైలైట్‌గా వుంటుంది. ఇలా ప్రతీదీ వేదాంతం అనండీ మరేదైనా సరే.. అంతా టైం ప్రకారమే జరుగుతుంది ఈ జీవితం అని క్లారిటీగా చెప్పాడు. అది కూడా ఎక్కువ ఎమోషన్‌ కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పడం విశేషం.
 
ఈ కథ సాయితేజ్‌కు కరెక్ట్‌గా సరిపోయింది. ప్రజల్లో తాను మంచి నాయకుడు అనిపించుకోవాలనుకునే పవన్‌కు చాలా యాప్ట్‌ అయింది. ఇందులో సంగీతపరంగా థమన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం, రెండు పాటలు ఓకే. మధ్యమధ్యలో పవన్‌ కళ్యాన్‌ గత సినిమాల తాలూకు బీట్‌లు కూడా ఆకట్టుకున్నాయి. నటీనటులపరంగా అందరూ బాగా నటించారు. 
 
టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ, కలర్‌ ప్యాట్రన్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ కూడా బాగుంది. నిర్మాణ విలువులు బాగున్నాయి. కథలో మార్క్‌ కుటుంబంలో వచ్చే ట్విస్ట్‌లు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి.
 
ఈ సినిమా ఇప్పటి యూత్‌ను ఆలోచింపజేసేదిలా వుంటుంది. 40 ఏళ్ళు పైబడినవారు బాగా కనెక్ట్‌ అవుతారు. ఇది పూర్తిగా కుటుంబంతో కలిసి చూడతగ్గ సినిమా. పవన్‌ అభిమానులకే కాదు అందరికీ చక్కటి వినోదాన్ని ఇచ్చే సినిమా ఇది.
 
రేటింగ్‌: 3.25/5