మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (07:44 IST)

మంచు ఫ్యామిలీని చూస్తే జాలేస్తోంది : జీవిత రాజశేఖర్

ఈ నెల 10వ తేదీ ఆదివారం రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మంచు ఫ్యామిలీ చూస్తే జాలేస్తుందంటూ వ్యాఖ్యానించారు. 
 
'ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు. ఎన్నికల వేళ ధర్మంగా న్యాయంగా పోరాడండి. ఇది మన కుటుంబం. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు, తాయిలాల అవసరం లేదు. లంచం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ‘మా’ సభ్యుల్లో సుమారు 920 మంది ఉంటారు. 60 ఏళ్ల పైబడిన వారు ఓటు వేయాలంటే భయపడుతున్నారు. ‘అమ్మా మీకు ఓటు వేయగలమా మీకు? వచ్చి  ఓట్లు గుద్దించుకువెళ్తారేమో' అని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు' జీవిత అన్నారు.
 
'నేను ఎంతో గౌరవంగా చూసే రాజీవ్‌ కనకాల, శివ బాలాజీ నిజాలు మాట్లాడడం లేదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాట తప్పు అని నిరూపిస్తా. వాళ్లది తప్పని నిరూపితమైతే మాకు ఓటేసి గెలిపించండి! నేను తప్పు మాట్లాడాను అనుకుంటే నడిరోడ్డు మీద చెప్పుతో కొట్టండి. ఓట్లు కోసం సైనికుల్లా పోరాడండి. అన్యాయంగా కాదు. ఎవరు మంచి చేస్తారో వాళ్లనే ఎన్నుకోండి. 
 
జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. విశాల్‌ నడిగర్‌ సంఘం అధ్యక్షుడు అయ్యారు. ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ అధ్యక్షుడు కాకూడదా? కళకి భాషాభేదాలు ఏంటి? ఎందుకు ఇవన్నీ లేవనెత్తుతున్నారు. మోహన్‌బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోంది. నరేశ్‌ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోతుంది. ‘మా’ విషయంలో నరేశ్‌ చేసినవన్నీ స్వార్థపూరిత పనులే!  ప్రకాశ్‌ రాజ్‌ నిజాయతీగా పనిచేస్తారు. నేను మంచి పనులు చేయాలని వచ్చా. జీవిత రాజశేఖర్‌లను పిచ్చోళ్లని చేయొద్దు' అంటూ ఘాటుగా మండిపడ్డారు.