జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న కోన వెంకట్... ఎందుకో?
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ రచయిత కోన వెంకట్. ఆయన అందించిన పలు సినిమాలకు అద్భుతమైన కథలను అందించారు. ఇలాంటి సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి వాటిలో అదుర్స్ కూడా ఒకటి. హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇందులో ఎన్టీఆర్ చారి పాత్రను పోషించారు. ఈ పాత్రను ఎన్టీఆర్ మినహా మరెవ్వరూ చేయలేరని అనేక మంది కితాబిచ్చారు. తారక్ డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అద్భుతమని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. వీవీ వినాయక్ దర్శకుడు. ఇందులో హీరో ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, షీలాలు హీరోయిన్లు. ముఖ్యంగా, ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ సినిమాకు హైలెట్.
ఈ నేపథ్యంలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ, "అదుర్స్-2" ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి, పిలక పెట్టుకుని నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. "అదుర్స్"లో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రను టాలీవుడ్‌లోనే కాదు భారతీయ చిత్రపరిశ్రమలో ఎవరూ చేయలేరని చెప్పారు. డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడని కితాబిచ్చాడు. అయితే అదుర్స్-2 చిత్రం చేసేందుకు ఎన్టీఆర్ అంగీకరిస్తాడా.. ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకుంటే వినాయక్ దర్శకత్వం వహిస్తాడా అనే సందేహం ఇపుడు నెలకొంది.