శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 10 అక్టోబరు 2019 (20:20 IST)

‘చిరంజీవి అంటే ప్రపంచం మర్చిపోతావేంటి?’ అని నా భార్య అంటుంది : కళాబంధు డా.టి. సుబ్బిరామిరెడ్డి

కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ, వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. 
 
బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. ‘సైరా’ బృందాన్ని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. 
 
ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. పిల్లలకు మనం నేర్పించాలి. కానీ రామ్ చరణ్ చిన్న వయసులోనే సింపుల్, హంబుల్, డౌన్ టుఎర్త్, అఫెక్షనేట్, ఫినామినల్ పర్సన్. అటువంటి రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడంటే అన్‌బిలీవబుల్. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్నాను. కానీ, రామ్ చరణ్ లాంటి ధైర్యం చేయలేదు. దమ్మున్న, మనసున్న వ్యక్తి రామ్ చరణ్. 
 
నటుడిగా చేస్తూనే నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ నుంచి ఈ మ్యాజిక్ అందరూ నేర్చుకోవాలి. చరణ్ పొగడ్తలు పట్టించుకోడు. చిరంజీవితో నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం స్టేట్‌రౌడి సినిమా నిర్మించాను. ఆ సినిమా హిందీలో డబ్ చేస్తే సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ఢిల్లీలో ఇద్దరం ఎంపీలుగా ఉంటూ పక్కపక్కనే ఉండేవాళ్లం. ‘చిరంజీవి అంటే ప్రపంచం మర్చిపోతావేంటి?’ అని నా భార్య ఇందిర అంటూ ఉంటుంది. 
 
చిరంజీవి హృదయం, మనసు మంచివి అందుకే తను అంటే నాకు అంత ఇష్టం అని చెబుతుంటా. చిరంజీవి కోసమే ప్రత్యేకంగా ఈ మాల తయారు చేసి తెప్పించా. తమన్నా ఈ సినిమాలో ఎంతో చక్కగా నటించి మెప్పించింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. తమన్నా నుంచి సురేందర్‌రెడ్డి అద్భుతమైన పనితనాన్ని రాబట్టుకున్నారు. నిజంగా సురేందర్‌ రెడ్డిని మెచ్చుకోవాలి. తమన్నా ఈ ఫంక్షన్‌కు రావడం కోసం ఎంతో కష్టపడింది. చెన్నైలో ఉన్నా ఆమె హుటాహుటిన ఈ కార్యక్రమం కోసమే హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ముంబై వెళ్లి, అక్కడి నుంచి ఫారిన్ వెళ్తోంది. బిజీ షెడ్యూల్‌లో కూడా నేను పిలవగానే వచ్చిన తమన్నాను అభినందిస్తున్నా.
 
ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ చాలా కష్టపడ్డారు. ఇది అందరికీ తెలియజెప్పాల్సిన కథ అంటూ పదేళ్లపాటు చిరంజీవి కోసం ఎదురుచూశారు. వాళ్ల సహనానికి హ్యాట్సాఫ్. నేను నిర్మించిన ప్రతి సినిమాకూ వాళ్లే కథా రచయితలు. వాళ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కెమెరామెన్ రత్నవేలు తన ప్రతిభ ఏంటో మరోసారి ఈ సినిమాతో చాటి చెప్పారు. అలాగే రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌తో పాటు విజయ్ మాస్టర్ కూడా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయనను కూడా అభినందిస్తున్నా. బుర్రాసాయిమాధవ్ తన డైలాగులతో ‘సైరా’ సినిమా స్థాయిని పెంచారు. 
 
ఇంకా ఇక్కడికి రాని చిత్రయూనిట్ అందరికీ నా ప్రశంసాభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. తెలుగు సినీ స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి.’’ అన్నారు.
 
పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాంత బయోటిక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తిని కాదు కాబట్టి, నా మాట కొంత నిజాయితీగా ఉంటుంది. ‘సైరా’ చిత్ర కథాంశం చాలా పవిత్రమైనది. దేశభక్తికి సంబంధించినది. ఇవాళ అది కొడగట్టిపోతున్న తరుణంలో మళ్లీ తట్టిలేపడానికి ఈ చిత్రాన్ని నిర్మించాలనుకోవడం గొప్ప అంశం. 
 
సైరాకు కథనం తయారు చేసిన పరుచూరి బ్రదర్స్‌కు జేజేలు. ఈ కథనాన్ని మంచి మాటల రూపంలో మలచిన సాయి మాధవ్ బుర్రాకు జేజేలు. ఇంత గొప్ప సృష్టిని వెండితెరపై ఆవిష్కరించిన సురేందర్‌రెడ్డికీ నా జేజేలు. ఇవన్నీ సమీకృతం చేసి, తానే దానికి ఆత్మ అయి, ఆయువుపట్టు అయి అద్భుతంగా దానికి ప్రాణ ప్రతిష్ట చేసిన నా ఆత్మీయుడు మెగాస్టార్ చిరంజీవికి పెద్ద జేజేలు. ఇంతమందిని సమాయత్తం చేసి వీళ్లందరికీ అవకాశం, ఒక వేదిక కల్పించి గొప్ప పని చేసిన రామ్ చరణ్ నా లెక్కలో ఇవాళ పెద్ద హీరో. అతను పూనుకోకపోతే ఇంత గొప్ప చిత్రం మనముందుకు వచ్చేది కాదు. హాట్సాఫ్ టు రామ్ చరణ్. ఇలాంటి గొప్ప మేనల్లుడిని పొందిన నా మిత్రుడు అరవింద్ కూడా గొప్పవాడు. థ్యాంక్యూ.’’ అన్నారు.
 
తమన్నా మాట్లాడుతూ.. ‘‘సుబ్బిరామిరెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే.. మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి గారిని గెడ్డం లేకుండా క్లీన్ షేవ్‌లో చూసే అవకాశం కల్పించారు. ఇలా అందరినీ ఈ వేదికపై చూడడం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమాలకు సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ట్రీట్ చేస్తారు. ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే సుబ్బిరామిరెడ్డిగారే కారణం. నా బిజీ షెడ్యూల్‌లో కూడా ఇక్కడకు వచ్చేలా సపోర్ట్ చేసిన సుబ్బిరామిరెడ్డి గారికి చాలా థ్యాంక్స్. 
 
సినిమా సక్సెస్ అయ్యాక దాన్ని ఎంజాయ్ చేయడానికి కదురదు. ఈ రోజు ఒక్క క్షణమైనా ఆ ఎంజాయ్‌మెంట్ పొందుతున్నానంటే అది మీ వల్లే. సో థ్యాంక్యూ సోమచ్ టు సుబ్బిరామిరెడ్డి గారు. ఈ సినిమాలో నటించే గొప్ప అదృష్టాన్ని కల్పించిన సురేందర్‌రెడ్డి, రామ్ చరణ్, చిరంజీవి గారికి చాలా పెద్ద థ్యాంక్స్.’’ అన్నారు.
 
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..‘‘సైరా నరసింహారెడ్డి అనగానే సైరా అంది ఫస్ట్ చిరంజీవి గారు. నెక్ట్స్ సైరా అంది మా చరణ్ బాబు. సైరా నరసింహారెడ్డి అనే సినిమాను జనంలోకి తీసుకెళ్లగానే జనమంతా ‘సైరా’ అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించిన చరణ్ బాబుకు, మా ఎవర్‌గ్రీన్ హీరో చిరంజీవి, మా డైరెక్టర్ సురేందర్‌ రెడ్డికి అభినందనలు. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ తాను ఉండి ప్రోత్సహించే సుబ్బరామిరెడ్డి గారికి కృతజ్ఞతలు.’’ అన్నారు.
 
డైరెక్టర్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఏ ముహూర్తాన చరణ్‌తో ‘ధృవ’ సినిమా తీశానో కానీ, నన్ను ఒక మంచి సబ్జెక్ట్, టీమ్ మధ్య నిలబెట్టాడు. థ్యాంక్యూ చరణ్. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం చిరంజీవిగారు ఇచ్చిన సపోర్ట్, ధైర్యమే. మెగాస్టార్ ప్రోత్సాహమే నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది.’’ అన్నారు.
 
రామ్ చరణ్ మాట్లాడుతూ..‘‘సుబ్బిరామిరెడ్డి గారి ఫంక్షన్ లేకపోతే ఆ సంవత్సరం మాకు ఏదో వెలితిగా ఉంటుంది. తమన్నా పక్కన మెరిసిపోతూ ఆయన డాషింగ్‌గా కనిపిస్తున్నారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడీ. నేనేదో ఆయకు ప్రొడ్యూసర్ అని అందరూ అంటున్నారు. కానీ, నేను అలా భావించట్లేదు. ఆయన సినిమాలో నేను కూడా ఒక వర్కర్ అంతే. ఆయన చిటికేస్తే ఎంతోమంది ప్రొడ్యూసర్‌లు ముందుకొస్తారు. అందుకే నేను ప్రత్యేకంగా ఆ స్థాయిని తీసుకోదల్చుకోలేదు. ఆయన సంకల్పమే మమ్మల్నందరినీ కలిపి ఆయన కోసం, పైన ఉన్న నరసింహారెడ్డి కోసం పనిచేసి ఇంతపెద్ద సినిమా చేయగలిగే అవకాశం మాకు ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్యూ.’’ అన్నారు.
 
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా దాన్ని తీసుకొచ్చి గౌరవించడం అన్నది సుబ్బిరామిరెడ్డిగారి గొప్పతనం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమాను ప్రేమించే అందరి కడుపులు నిండటమే కాకుండా మా కుటుంబం కడుపులు చాలా నిండిపోయేటట్టుగా చేసిన సినిమా ‘సైరా’. అందుకు చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇటువంటి గొప్ప సినిమాను మా మేనల్లుడు తీశాడనే గొప్పతో పాటు చిన్న ఈర్ష్య కూడా ఉంది.’’ అన్నారు.
 
రత్నవేలు మాట్లాడుతూ..‘‘సైరా ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. చిరంజీవిగారు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. థ్యాంక్యూ ’ అన్నారు. బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ..‘‘చిరంజీవి గారి అభిమాని నాకు కాల్ చేసి ‘సార్ మన అన్నయ్యకు చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇచ్చారు’ అన్నారు. అప్పుడు నేనొక్కమాట అన్నా.. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. చిరంజీవిగారు చేస్తే మామూలు సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. మామూలు సినిమాలే ఆయన చరిత్రలో నిలబెట్టారు. అలాంటిది చరిత్రలో నిలిచిపోయే లక్షణాలున్న సినిమా చిరంజీవి గారికి వస్తే ఎలా ఉంటుంది.. సైరాలా ఉంటుంది. నా జీవితం మొత్తం చెప్పుకొనే సినిమాకు నేను పనిచేశాను’’ అన్నారు.
 
బ్రహ్మాజీ మాట్లాడుతూ..‘‘ఇంత గొప్ప సినిమాలో నాకు ఒక పాత్ర లభించడానికి ముఖ్య కారణం ఎవరంటే మా చరణ్ బాబు. ‘రంగస్థలం’ షూటింగ్‌లో అన్నయ్య పక్కన ఒక్క సీన్ ఇవ్వు అంటూ రోజూ బతిమాలితే సురేందర్‌రెడ్డి గారిని కన్విన్స్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్యూ సురేందర్‌రెడ్డి. ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా గ్లామర్ బాయ్ సుబ్బుకి థ్యాంక్యూ వెరీమచ్.’’ అన్నారు. 
 
మురళీమోహన్ మాట్లాడుతూ..‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన గొప్ప సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ సినిమా అయిందని నిరూపించిన నా తమ్ముడు చిరంజీవికి నా హృదయపూర్వక అభినందనలు. మున్ముందు మరిన్ని ఇలాంటి మంచి సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీ లెవల్‌ను ప్రపంచ స్థాయికి తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.’’ అన్నారు. 
 
రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘చిరంజీవిగారి గురించి మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. ఇంత పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం ఉండాలి. హ్యాట్సాఫ్ టు రామ్ చరణ్. చిరంజీవిగారు లేకుండా రామ్ చరణ్ లేరు. గొప్ప సినిమా తీసి తన తండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చాడు. తెలుగువాళ్లందరూ గర్వంగా ఫీలయ్యే సినిమాలో యాక్ట్ చేసిన చిరంజీవి గారికి హ్యాట్సాఫ్. ఇంత పెద్ద సినిమాను సురేందర్‌రెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన చాలా లక్కీ. చిరంజీవి గారూ.. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు ఖర్చుపెట్టడం, ఇంత పెద్ద సినిమా చేయడం నిజంగా హ్యాట్సాఫ్ టు యు. అండ్ గ్రేట్. అందరూ ఈ వయసులో అని అంటున్నారు. సినిమా చూసినప్పుడు నాకు ఆయన వయసు కనిపించలేదు. ఆ స్పీడ్ అంతా ఎప్పటిలాగే అనిపించింది. తెలుగువారందరూ గర్వపడేలా చేసిన చిరంజీవిగారు నిజంగా గ్రేట్. ఇలాంటి కార్యక్రమం సుబ్బిరామిరెడ్డిగారు మాత్రమే ఏర్పాటు చేయగలరు. మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు’’ అన్నారు.
 
దిల్‌రాజు మాట్లాడుతూ...‘‘ఇంతకు ముందు సక్సెస్ మీట్‌లో చెప్పినట్లు చిరంజీవి గారికి ఇది కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్. 151 సినిమాల్లో ఎన్నో అద్భుతాలు చూశారు. ఎన్నో విజయాలు చూశారు. కానీ, ఇదొక మైల్‌స్టోన్ సినిమా.’’ అన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘గత పదిహేను రోజుల నుంచి ‘సైరా’ విజయం గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ చెప్పాల్సింది దాని గురించి కాదు. ఎక్కడ మంచి జరిగినా.. పదిమంది సంతోషంగా ఉన్నా.. అందులో తానూ భాగం అవుతూ పదిమందికీ సంతోషాన్ని పంచే వ్యక్తి సుబ్బిరామిరెడ్డి. ఆయనను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయనకు కళాబంధు అని ఎవరు పెట్టారో తెలీదు కానీ, ఆయన మనసు నిజంగా అద్భుతం. ‘సైరా’ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన నాతో ఆనందం పంచుకున్నారు. 
 
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీస్తున్నామని తెలిసినప్పటి నుంచి ఆయన ఎంతో శ్రద్ధ చూపించారు. ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునేవారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని ధీమాగా చెప్పేవారు. ఈ సినిమా హిట్ అయితే ఆయనే నిర్మాతగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయినంత ఆనందాన్ని మాతో పంచుకోవడం, మమ్మల్ని అభినందించడం సంతోషంగా ఉంది. ఆయన కళాహృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆయన ప్రేమ, అభిమానంతో నా గుండె నిండిపోయింది. ‘సైరా’ను నా జీవితంలో గుర్తుండిపోయే సినిమాగా తెరకెక్కించిన సురేందర్‌రెడ్డికి ఎన్నిసార్లు అభినందనలు చెప్పినా తక్కువే. 
 
బుర్రా సాయిమాధవ్ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు చాలా థ్యాంక్స్. ఇంత గౌరవప్రదమైన సినిమాను నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన రామ్ చరణ్ నా నిర్మాతలందరిలోనూ నెంబర్ వన్ ప్రొడ్యూసర్. నేటితరం హీరోయిన్లకు తమన్నా ఆదర్శం. ఆమె డెడికేషన్ మాటల్లో చెప్పలేనిది.’’ అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేశ్, జీవిత రాజశేఖర్ దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఛార్మి, కేథరిన్, నిహారిక, అశ్వినీదత్, బోనీకపూర్, సురేష్ బాబు, డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, క్రిష్, సుకుమార్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, రాజకీయ నాయకులు రఘురామ కృష్ణంరాజు, మురళీమోహన్, కేవీపీ, పీవీపీ, సీఎం రమేష్, దానం నాగేందర్, జేసీ పవన్‌ రెడ్డి, క్రీడారంగం నుంచి చాముండేశ్వరినాథ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సన్‌షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి చిరంజీవి మీద అభిమానంతో ‘సైరా’ ప్రత్యేక కేక్‌ను తయారుచేయించి మెగాస్టార్‌కు బహూకరించారు.