గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (20:02 IST)

ఎన్.టి.ఆర్ శత జయంతి వేడుకలు, వెబ్ సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

NTR  website, special edition
NTR website, special edition
నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారి చరిత్ర భావి తర తరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశ్యంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి జనార్దన్ తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్.టి.ఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ జనార్దన్ మీడియాతో మాట్లాడారు.
 
ఎన్. టి. రామారావు గారు సినిమా రంగంలో ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలను పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో ప్రజానాయకుడుగా జేజేలందుకున్నారు. వారు తెలుగునాట మాత్రమే కాదు, భారత రాజకీయాలలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించి, జాతీయ నాయకుడుగా ప్రతిపక్షాలను. ఏకత్రాటి మీదకు తెచ్చిన దూరదృష్టి కల నాయకుడు, ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారి కి మార్గదర్శకం కావాలనే ఉద్ధేశ్యంతో మా కమిటీ ఈ బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసిందని జనార్దన్ తెలిపారు .
 
రామారావు గారి సినిమా ప్రస్థానం, రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్.టి.ఆర్ వెబ్ సైట్ రూపకల్పన జరుగుతోంది. అలాగే రామారావు గారితో చిత్ర రంగంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ రంగంలో వారితో సాన్నిహిత్యం వున్న నాయకులు, పనిచేసిన వారి వ్యాసాలు, ప్రముఖుల కథనాలు, సందేశాలు, అరుదైన ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక రూపొందుతుందని జనార్దన్ చెప్పారు. అలాగే రామారావు గారు శాసన సభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురిస్తున్నామని జనార్దన్ తెలిపారు.
 
రామారావు గారు నటుడుగా మూడున్నర దశాబ్దాలలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. మూడు తరాల ప్రేక్షకులకు ఆయన అభిమాన నటుడయ్యారు. సినీ రంగంలో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అపూర్వం, అనితర సాధ్యం. కేవలం నటుడిగానే కాక ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అన్నగా నేనున్నానంటూ ముందు కొచ్చి ఆదుకున్నాడు. రాయలసీమ కరవు, చైనా యుద్ధం, దివిసీమ సీమ ఉప్పెన లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, దేశరక్షణ కోసం నిధులు సమకూర్చడానికి సహా నటీనటులతో కలసి విరాళాలు సేకరించారు. ఆయన చేసిన అసమాన సేవ ఆయన్ని రాజకీయ రంగం వైపు నడిపించిందని జనార్దన్ తెలిపారు.