మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ 27 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన దేవర చిత్రానికి ఆడియెన్స్ మరుపురాని హిట్‌ను అందించారు. సైఫ్ అలీ ఖాన్ భైరాగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ల మీద కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు.
దేవర మూవీ క్వాలిటీ, నిర్మాణ విలువలు, ఆకర్షణీయమైన కథనం, ప్రచార కార్యక్రమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను సాధించాయి. 500 కోట్లకు పైగా వసూలు చేసి గణనీయమైన లాభాలను ఆర్జించింది. ఈ అద్భుతమైన విజయం ఎన్టీఆర్‌కు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి, మీడియాకు ఎన్టీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఆ ప్రెస్ నోట్‌లో నటుడు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వంటి వారు పాత్రలకు ప్రాణం పోయడం, దర్శకుడు కొరటాల శివ తన అద్భుతమైన విజన్, టీమ్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని అన్నారు.
దేవర కోసం పని చేసిన సాంకేతిక నిపుణులను ఎన్టీఆర్ అభినందిస్తూ.. సినిమా విజయవంతమవడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను అభినందించారు. సినిమా విజయానికి ముఖ్య సహకారం అందించిన నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు, సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
దేవర పార్ట్ 1కి వచ్చిన ఆదరణ, కురిపిస్తున్న ప్రేమను చూసి నాకు ఎంతోగానో సంతోషం వేస్తోంది. ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఇంత స్పెషల్ అయిన చిత్రానికి మీ అందరూ ప్రేమను, సపోర్ట్‌ను ఇచ్చి బ్లాక్ బస్టర్ చేయడం చూసి మరింత ఆనందం వేస్తోంది. నా సహ నటులు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. పాత్రలకు ప్రాణం పోసిన ఆర్టిస్టులందరికీ థాంక్స్. ఇంత గొప్ప ప్రపంచాన్ని క్రియేట్ చేసిన కొరటాల శివ గారికి థాంక్స్. ఆయన నాయకత్వం, దర్శకత్వంతో దేవర విజన్ రియాల్టీలోకి వచ్చింది. అనిరుధ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేవర చిత్రానికి ఆయన బ్యాక్ బోన్‌లా నిలబడ్డారు. రత్నవేలు సర్ ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా తీర్చి దిద్దారు. సాబు సిరిల్ సర్ అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ ఇలా అందరూ కలిసి దేవరను ఓ అద్భుతంగా మార్చారు.
థియేటర్లో ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు థాంక్స్. ఇంతగా సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి థాంక్స్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అవ్వడానికి ఇంత బాగా రావడానికి కారణమైన హరికృష్ణ కొసరాజు గారికి థాంక్స్. మా కంటే ఈ సినిమాను ఎక్కువగా సెలెబ్రేట్ చేసిన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు థాంక్స్. మీ ప్రేమాభిమానాలను చూసి నా నోట మాట రాలేదు. నా వెన్నంటే ఉంటూ నాకు అంతులేపి ప్రేమను, సపోర్ట్ ఇస్తున్న నా అభిమానుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను.
మీరు చూపించే ప్రేమ వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకమే నాకు ఎప్పుడూ ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంటుంది. మీకు నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీ అందరినీ గర్వపడేలా చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవర పార్ట్ 1ను మీ భుజానికి ఎత్తుకుని ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు థాంక్స్ అని ఎన్టీఆర్ అన్నారు.