తెలుగు చిత్రసీమలో ఎందరో అందాలనటుడు అన్న మాటను తమ ముందు చేర్చుకున్నవారు ఉన్నారు. అందాలనటుడు అనగానే చప్పున మనకు గుర్తుకు వచ్చేది యన్టీఆర్, శోభన్ బాబు, ఆ తరువాత హరనాథ్. ఈ ముగ్గురూ కలసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. దక్షిణాదిన శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరు యన్టీఆర్. ఆయన ఇతర పాత్రలు పోషించిన పౌరాణికాల్లో శ్రీరామ, శ్రీకృష్ణ వంటి పాత్రలను కాంతారావు, హరనాథ్ తోనే నటింప చేశారు. అలా ఆ రోజుల్లో హరనాథ్ అందాలనటుడుగా అలరించారు.నటుడు హరనాథ్ వర్థంతి నేడు.
హరనాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరనాథరాజు. 1936 సెప్టెంబర్ 2న తూర్పు గోదావరి జిల్లా రాపర్తిలో ఆయన జన్మించారు. తరువాత వారి పెద్దలు మద్రాసులో ఉండడంతో పి.యు.సి. దాకా అక్కడే చదివారు. కాకినాడ పి.ఆర్.కాలేజ్ లో బి.ఏ., పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో ఆయన సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేవారు. పలు నాటకాల్లో నటించి ఆకట్టుకున్నారు. పైలట్ కావాలని ఆశించారు హరనాథ్. అయితే అనుకోకుండా ఓ సారి హరనాథ్ ను నటదర్శకుడు ముక్కామల చూడడం తటస్థించింది. ఆయన తన ఋష్యశృంగ చిత్రంలో కథానాయకునిగా హరనాథ్ ను ఎంచుకున్నారు. తరువాత జమునతో కలసి మా ఇంటి మహాలక్ష్మి చిత్రంలో నటించారు హరనాథ్. ఈ రెండో చిత్రమే ముందుగా విడుదలయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో హరనాథ్ కు హీరోగా గుర్తింపు లభించింది.
యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో తనకు లభించిన పాత్రల్లో నటించి మరింత పేరు సంపాదించారు హరనాథ్.
యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సీతారామకళ్యాణంలో శ్రీరాముని పాత్రలో హరనాథ్ ను నటింప చేశారు. అదే చిత్రంలో లక్ష్మణునిగా శోభన్ బాబును ఎన్నుకున్నారు. ఆ సినిమా విజయంతో హరనాథ్ కు పౌరాణిక పాత్రలూ లభించసాగాయి. యన్టీఆర్ భీష్మలో హరనాథ్ శ్రీకృష్ణునిగా, శోభన్ బాబు అర్జునునిగా నటించారు. ఈ చిత్రం సైతం వారికి మంచి పేరు తెచ్చింది. యన్టీఆర్ హీరోగా రూపొందిన “కలసివుంటే కలదు సుఖం, ఆత్మబంధువు, పెంపుడు కూతురు, పాండవవనవాసము, నాదీ ఆడజన్మే, పల్నాటియుద్ధం, పుణ్యవతి, ఆడపడచు, చిట్టిచెల్లెలు” వంటి చిత్రాలలో హరనాథ్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఏయన్నార్ తో హరనాథ్ కలసి “రుణానుబంధం, అమరశిల్పి జక్కన్న, రహస్యం” చిత్రాలలో నటించారు. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన గుండమ్మకథలో హరనాథ్, జమున అన్నయ్యగా నటించారు. కానీ, కొందరు ఆ ఇద్దరు మహానటులు హరనాథ్ ను ఎదగకుండా తొక్కేశారు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటివారికి ఈ చిత్రాలే జవాబు అని చెప్పవచ్చు.
హరనాథ్ భక్త ప్రహ్లాద తెలుగు, తమిళ, కన్నడ మూడు భాషల్లోనూ విష్ణు పాత్రలో నటించడం విశేషం! శ్రీరామకథలో శ్రీరామునినూ, భీమాంజనేయ యుద్ధంలో శ్రీకృష్ణునిగానూ, పాండవవనవాసములో అభిమన్యునిగానూ, రహస్యం, బాలభారతం చిత్రాలలో నారదునిగానూ హరనాథ్ అభినయించి ఆకట్టుకున్నారు.
హరనాథ్ హిట్ పెయిర్ జమున అనే చెప్పాలి. నిజానికి హరనాథ్, జమున ఒకే వయసు వారు. ఇద్దరూ 1936లోనే జన్మించారు. ఆమె హరనాథ్ కంటే మూడు రోజులు పెద్దది. వారిద్దరూ తొలిసారి నటించిన మా ఇంటి మహాలక్ష్మి ఆదరణ పొందగా, ఆ తరువాత లేతమనసులు సూపర్ హిట్ గా నిలచింది. “నాదీ ఆడజన్మే, పల్నాటియుద్ధం, పెళ్ళిరోజు, ఆడజన్మ, మా ఇంటి దేవత” వంటి చిత్రాలలో హరనాథ్ – జమున జోడీ అలరించింది.
తరువాతి రోజుల్లో హరనాథ్ తాగుడుకు బానిసై తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నారు. ఆపై కొన్ని చిత్రాలలో గెస్ట్ రోల్స్ లో నటించారు. కానీ, అవేవీ ఆయనకు అంతగా గుర్తింపు సంపాదించ లేకపోయాయి. 53 ఏళ్ళ వయసులోనే 1989 నవంబర్ 1న హరనాథ్ కన్నుమూశారు. ఆయన తనయుడు బి.శ్రీనివాసరాజు నిర్మాతగా సాగారు. “గోకులంలో సీత, రాఘవేంద్ర, మా అశోక్ గాడి లవ్ స్టోరీ” వంటి చిత్రాలను శ్రీనివాసరాజు నిర్మించారు. ఏది ఏమైనా తెలుగునాట అందాల నటులు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు తప్పకుండా హరనాథ్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది.