శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (12:31 IST)

ప్లాస్మా దానం చేయాలంటూ చిరంజీవి - నాగార్జున వినతి

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా వుంది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొందరు ప్రాణాలను నిలుపుకునేందుకు ప్లాస్మా కావాలంటున్నారు. అందువల్ల కొవిడ్‌ వారియర్స్‌ ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జునలు విజ్ఞప్తి చేశారు. 
 
ఈ మేరకు వారు వేర్వేరుగా తమతమ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ వేదికగా కొవిడ్‌ వారియర్స్‌ ప్లాస్మాను దానం చేయాలన్నారు. "కొవిడ్ సెకండ్‌ వేవ్‌ చాలా మందిపై ప్రభావం చూపుతుందనే సంగతి మీ అందరికీ తెలిసిందే. కొన్నిరోజుల ముందు మీరు కొవిడ్‌ నుంచి కోలుకుని ఉంటే, మీ ప్లాస్మాను దానం చేయండి. దీని కారణంగా మరో నలుగురు కొవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. వివరాల కోసం, గైడెన్స్‌ కోసం చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని కోరుతున్నాను" అంటూ ట్రస్ట్‌ నెంబర్‌ను ట్వీట్ చేశారు చిరంజీవి. 
 
అలాగే, కొవిడ్‌ సెకండ్ వేవ్‌ కారణంగా కొవిడ్‌ బారిన పడిన బాధితులకు అండగా నిలబడాలని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేసి కష్ట సమయంలో ప్రాణాలను కాపాడాలన్నారు నాగార్జున. టీ హోప్‌ అనే స్వచ్చంద సంస్థలో అందరూ భాగం కావాలని కోరుతూ నాగార్జున ట్వీట్‌ చేశారు. 
 
ఇలా అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున వంటి వారు ప్లాస్మాను దానం చేయాలని కొవిడ్‌ వారియర్స్‌కు పిలుపునివ్వడం మంచి పరిణామమే. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే టాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు, స్టార్స్‌ అందరూ ఆక్సిజన్‌, బెడ్స్‌, ప్లాస్మా అవసరం అయిన వారి వివరాలను రీ ట్వీట్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.