నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో "పుష్ప"రాజ్ సందడి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ కె.సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". గత నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ప్రతి భాషలోనూ సూపర్ హిట్ సాధించి, కనకవర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుని జనవరి 7వ తేదీ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.
పుష్ప తెలుగు వెర్షన్ మాత్రం అల్లు కుటుంబానికి చెందిన సొంత ఓటీటీ ఫ్లాట్‌ఫాం "ఆహా"లో ప్రసారంకానుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోని పుష్ప మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేయనున్నారు.
పూర్తి గ్రామీణ నేపథ్యంలో శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, విలన్ పాత్రల్లో కనిపించిన సునీల్, అనసూయలు పూర్తి డీగ్లామర్‌గా కనిపించి అద్భుతమైన నటనను ప్రదర్శించారు.