రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి.. చెన్నైలో ఉంటే ఏంటి?: వర్మ ప్రశ్న
రాజధాని మార్పుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి అంటూ ఎదురు ప్రశ్నవేశారు. తనకు వరకు రాజధాని ఎక్కడున్నా ఒక్కటేనని చెప్పారు. అలాగే, రాజకీయాలతో సంబంధంలేని సామాన్య ప్రజలకు రాజధాని ఎక్కడున్నా ఒక్కటేనని అన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని విశాఖపట్టణానికి తరలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీన్ని రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీలన్నీ ఒక్కటై జగన్‌ను పిచ్చి తుగ్లక్‌తో పోల్చుతున్నారు.
ఈనేపథ్యంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. తనవరకు రాజధాని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని స్పష్టం చేశారు.
రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన వర్మ, ప్రజలకు నేరుగా పాలన అందించడం కోసమే రాజధాని అనుకుంటే, ప్రతి నగరంలో ఓ రాజధాని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.