శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (15:00 IST)

అజ్ఞాతం వీడిన రియా... రూ.15 కోట్లు ఎవరికిచ్చారంటూ ఈడీ ప్రశ్నలు

సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసులో విచారణలో భాగంగా, సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు మరో ఖాతాకు బదిలీ కావడంపై సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ కేసులో ఆమె గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. కానీ, ఈడీ అధికారుల సమన్లతో ఆమె అజ్ఞాతం వీడకతప్పలేదు. 
 
బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆమెపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు బదిలీ కావడంపై ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని రియాను ఆదేశించింది.
 
అయితే, సుప్రీంలో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్మెంట్‌ను రికార్డు చేయవద్దని ఈడీని రియా కోరింది. అయితే, ఆమె విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేశారు. ఫలితంగా మరోమార్గం లేక ముంబైలోని ఈడీ కార్యాలయానికి రియా చక్రవర్తి హాజరైంది. 
 
సుశాంత్ కేసులో రంగంలో సీబీఐ : ఎఫ్‌ఐఆర్‌లో రియా కుటుంబ సభ్యుల పేరు 
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ ఆత్మహత్య కేసులోని మిస్టరీని ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరును ఏ1గా పేర్కొనగా, ఆమె కుటుంబానికి చెందిన మరో ఐదుగురి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
 
ఈ ఎఫ్ఐఆర్‌లో రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, తల్లి సంధ్యా చక్రవర్తి, సోదరుడు షౌకి చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరండా, సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజరు శృతి మోడీలు ఉన్నారు. ఈ కేసులో వీరిని ప్రాథమిక నిందితులుగా పేర్కొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, ఈ కేసును బీహార్ పోలీసుల సహకారంతో సీబీఐ దర్యాప్తు చేయనుంది. 
 
ఇదిలావుంటే, ఈడీ జారీ చేసిన నోటీసులపై రియా చక్రవర్తి ఎట్టకేలకు స్పందించింది. ఈడీ నోటీసుల ప్రకారం రియా శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయని, సుప్రీంలో తదుపరి విచారణ జరిగే వరకూ తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడాన్ని వాయిదా వేయాలని ఈడీని రియా కోరింది. 
 
అదేసమయంలో ఈడీ.. సుశాంత్ రాజ్‌పుత్ కేసులో తాజాగా మరో ఇద్దరికి కూడా సమన్లు పంపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడీకి సమన్లు పంపిన ఈడీ శుక్రవారం విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టం చేసింది. సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథానికి కూడా నోటీసులు పంపిన ఈడీ రేపటిలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాత ఖాతాకు మళ్లించిందనే ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది.