సోనూ సూద్ కోసం పాదయాత్ర.. 700 కి.మీటర్లు కాలినడకన..?
సోనూ సూద్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు కూడా సోనును దైవంగా భావించాడు. తను దేవుడిని నేరుగా కలవాలని ఎవరూ చేయని సాహసం చేశాడు. అతడి తండ్రి ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో వెంకటేష్ హైదరాబాద్‌కు వెళ్లి ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.
వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఐతే లాక్‌డౌన్‌లో సోను సూద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి... ఆయనకు అభిమానిగా మారిపోయాడు వెంకటేష్. రోజు రోజుకు అభిమానం పెరిగిపోయింది. సినిమా నటుడిలా కాకుండా ప్రత్యక్ష దైవంగా చూశాడు. ఈ క్రమంలోనే ఆయన్ను ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. లాక్‌డౌన్ ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో.. కాలి నడకన ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలు దేరాడు వెంకటేష్. 700 కి.మీ. కాలినడకన వెళ్లి ఎలాగైనా కలవాలని భావిస్తున్నాడు. వెంకటేష్ పాదయాత్ర గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న సోనూసూద్.. అతడికి ఫోన్ చేశారు. నడుచుకుంటూ ముంబైకి రావొద్దు.. తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. స్వయంగా సోనుసూదే ఫోన్ చేయడంతో వెంకటేష్ సంతోషాన్ని పట్టలేకపోయాడు.
కానీ తన పాదయాత్రను ఆపలేదు. సోనూసూద్‌ను కలవాలన్న మొండి పట్టుతో కాలి నడకన ముందుకు కొనసాగించారు. వెంకటేష్ సంకల్పం గొప్పదని.. పాదయాత్ర విజయవంతం కావాలని అతడి కుటుంబ సభ్యులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇతడి గురించి తెలిసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.