ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (09:29 IST)

ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన "టాప్-50" నటుల్లో షారూక్ ఖాన్

sharukh khan
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ "ఎంపైర్" తాజాగా ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన "టాప్-50" జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో భారతదేశం నుంచి ఒకే ఒక్క నటుడు స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ బాద్ షా... షారూక్ ఖాన్. "50 గ్రేటెస్ట్ యాక్టర్ ఆల్‌టైమ్" పేరుతో ఈ జాబితాను రూపొందించి విడుదల చేసింది. ఇందులో హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు డెంజల్ వాషింగ్టన్, టామ్ హాంక్స్, ఆంథోనీ, మార్లన్ బ్రాండో వంటి దిగ్గజ నటీనటులతో పాటు షారూక్ ఖాన్ ఉన్నారు. 
 
కాగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత నాలుగు దశాబ్దాలుగా తన ప్రతిభతో రాణిస్తున్న షారూక్ ఖాన్... సినీ కెరీర్‌లో ఆయన సాధించిన విజయాలు, ఆయనకున్న అభిమానగణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితాలో షారూక్ పేరును ఎంపైర్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 
 
"ఎంపైర్" మ్యాగజైన్ కథనాన్ని షారూక్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం "పఠాన్" ఇపుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. దీంతో విడుదలకు సమస్యలు ఎదురుకానున్నాయి. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాలన్న డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. "బాయ్‌కాట్ పఠాన్" అనే హ్యాష్‌టాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.