అచ్చం వైఎస్ఆర్‌లాగే ఆలోచన చేస్తున్న జగన్ : దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి
అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ గురించి చెప్పాలని అనిపించి తాను మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఆయన గురించి చెప్పకుంటే తప్పు చేసిన వాడిగా మిగులుతానన్న భావన కలిగిందని అన్నారు.
రాష్ట్రంలో వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న జగన్‌కు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న విషయంపైనా ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
ముఖ్యంగా, విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమం తదితర అంశాల గురించి ఆలోచించే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనకు ఉందని, జగన్ చేస్తున్న ప్రతి పనీ తన మనసులో నాటుకుందని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.
తన తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఎలా ఆలోచించేవారో, జగన్ కూడా అలానే ఆలోచిస్తున్నారని, ప్రజల మేలుకోరే ఇటువంటి నాయకుడు అధికారంలోకి రావడం అవసరమని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.