గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (18:12 IST)

మిల్కీబ్యూటీ తమన్నా 'లెవన్త్‌ అవర్‌'.. త్వరలోనే 'ఆహా'లో ప్రసారం

సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా మాధ్యమం.. ఇప్పుడు 18 మిలియన్‌ వీక్షకులను సొంతం చేసుకుని సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 'ఆహా' ప్రేక్షకులను ఆహా అనిపించేలా ఛాలెంజింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'లెవన్త్‌ అవర్‌' అనే వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తోంది. 
 
త్వరలోనే ఆహాలో ప్రసారం కానున్న 'లెవన్త్‌ అవర్‌' వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను, పోస్టర్‌ను సోమవారం రోజున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు, రైటర్‌-ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ, "అరవింద్‌ సినిమాల వల్ల నేను యాక్టర్‌ నుండి స్టార్‌ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న '11 అవర్‌' సిరీస్‌ వల్ల ఓ స్టార్‌ నుండి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. నా కెరీర్‌లో అరవింద్‌ చాలా స్పెషల్‌. వ్యక్తిగతంగా ఆయనంటే నాకెంతో ఇష్టం. పదేళ్ల ముందు అరవింద్‌ ఎంతో ఆసక్తిగా, ఉల్లాసంగా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆయన ఆలోచనలను మార్చుకుంటూ వస్తున్నారు. మంచి కంటెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 'ఆహా' మాధ్యమం అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌ను అందించడానికి ట్రై చేస్తుంది. ఓ యాక్టర్‌గా నేను తెలుగు సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. 
 
తెలుగు కంటెంట్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక 'లెవన్త్‌ అవర్' విషయానికి వస్తే.. చాలా మంచి పొటెన్షియల్‌ ఉన్నస్క్రిప్ట్‌‌. లాక్‌డౌన్‌లో నేను విన్న మొదటి స్క్ర్రిప్ట్‌ . ప్రదీప్‌గారులాంటి నిర్మాతలను చాలా తక్కువగా చూస్తాం. మంచి నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తే కాదు.. చాలా మంచి వ్యక్తి కూడా. ఈ వెబ్‌సిరీస్‌  షూటింగ్‌ సమయంలో నాకు కరోనా సోకితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి విపత్కర సమయంలో పనిచేయడం చాలా కష్టం. అయినా కూడా కోవిడ్‌ రూల్స్ ఫాలో చేస్తూ షూటింగ్స్‌ చేస్తున్నారు. ఆహా టీమ్‌కు కూడా ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను" అన్నారు.
 
రైటర్‌, నిర్మాత ప్రదీప్‌ మాట్లాడుతూ "ప్రవీణ్‌ సత్తారు, తమన్నా, అరవింద్‌ ఇలా ఓ మంచి టీమ్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. ఈ వెబ్‌సిరీస్‌ కథను '8 అవర్స్‌' అనే బుక్‌నుండి రైట్స్ కొని తయారు చేసుకున్నాను" అన్నారు. 
 
ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, "ప్రదీప్‌ ఓ రోజు ఓకథను తీసుకొచ్చి వినిపించారు. కథ నాకు బాగా నచ్చింది. కొన్ని గంటల్లో నడిచే కథ. దర్శకుడు ఎవరో అప్పటికింకా అనుకోలేదు. ఒక మంచి స్టార్‌, దర్శకుడు కలిస్తేనే ఈ సిరీస్‌ను పెద్దదిగా చేయగలం అనిపించింది. అప్పుడు మా ఆహా టీమ్‌ సభ్యులు తమన్నా పేరుని సూచించారు. తమన్నా మా గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో ఇది వరకు హీరోయిన్‌గా ఆమె సినిమాలు చేశారు. ఆ నమ్మకంతో ఆమెను సంప్రదించాం. ఆమె ఒప్పుకున్నారు. 
 
దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు విషయానికి వస్తే.. తను ఓ విలక్షణ దర్శకుడు. తను ఏ సినిమా చేసినా ఆ జోనర్‌కు తగ్గట్టు చక్కగా సినిమాను తెరకెక్కించగలడు. ఏ సినిమాను పడితే ఆ సినిమాను చేయాలని అనుకోడు. కథ విని నచ్చితేనే చేస్తాడు. తను ఈ సబ్జెక్ట్‌ విని బావుందని అన్నారు. ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్‌ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్‌సిరీస్‌ చేయమని అడిగాను. ఇక ఈ వెబ్‌సిరీస్‌ టైటిల్‌ను పెట్టడానికి చాలా ఆలోచించాం. చివరగా కొన్ని మాటల సందర్భంలో టైటిల్‌ను 'లెవన్త్‌ అవర్‌' అని ఖరారు చేశాం" అన్నారు. 
 
డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ "అరవింద్‌కి 'ఆహా' కోసం ఓ స్క్రిప్ట్‌ను వినిపించాను. అది ఆయనకు బాగా నచ్చింది. దాన్ని డెవలప్‌ చేస్తున్న తరుణంలో ఓ కథ ఉంది. నువ్వు నీ కథలనే డైరెక్ట్‌ చేస్తావా లేక.. వేరే వాళ్లు రాసిన కథనైనా డైరెక్ట్‌ చేస్తావా? అని ఓరోజు అరవింద్‌ అడిగారు. కథ బావుంటే ఎవరు రాసిన కథనైనా డైరెక్ట్‌ చేస్తానని అన్నాను. తర్వాత ప్రదీప్‌ రాసిన స్క్రీన్‌ప్లే ఇచ్చారు. అది చదివిన తర్వాత ప్రదీప్‌ నిర్మాతే కాదు.. న్యూ ఏజ్‌ రైటర్‌ కూడా అని అర్థమైంది. 
 
ఓ సిరీస్‌కు ఉండాల్సిన అన్నీ అంశాలు ఈ 'లెవన్త్‌ అవర్‌'లో ఉన్నాయి. ఓ నెల తర్వాత షూటింగ్‌ స్టార్ట్ చేశాను. తమన్నాగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 రోజుల పాటు రాత్రి సమయంలోనే సినిమాను షూట్‌ చేశాం. తను బాగా సపోర్ట్‌ చేసింది. టైటిల్‌తోనే అసలు మేం ఎలాంటి కంటెంట్‌ను చూపించబోతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఒక రాత్రిలో జరిగే కథ. అందులో తమన్నా పాత్ర, ఓ కంపెనీని ఎలా సేవ్‌ చేసిందనేదే కథ. పురుషాధిక్యత ప్రపంచంలో ఓ అమ్మాయి తన కలలను ఎలా నిజం చేసుకుందనేదే కథ. హ్యుమన్‌ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ గురించి ఇందులో మాట్లాడాం. 
 
ప్రస్తుతం ఉన్న కార్పొరేట్‌ ప్రపంచంలో మహిళలు ఎలా ఉన్నారనే విషయాన్ని టచ్‌ చేశాం. ఓ బోర్డ్‌ రూమ్‌లో రాత్రి వేళలో జరిగే కథ కాబట్టి ఇందులో పరిగెత్తడాలు, గన్‌ఫైట్స్‌, ఛేజింగ్‌లుండవు. ఆహా టీం అద్భుతమైన సపోర్ట్‌ అందించారు. ఓ పర్టికులర్‌ ఏరియాలో షూటింగ్‌ చేయడమంటే చాలా ఛాలెంజ్‌తో కూడుకున్నది. కానీ కెమెరామెన్‌ ముఖేష్‌ సాయంతో చాలా బాగా పూర్తి చేయగలిగాం. తమన్నా తన భుజాలతో సిరీస్‌ను క్యారీ చేసింది. ఈ సిరీస్‌కు సీజన్‌ 2 ఉంటుందనేలా ఎండింగ్‌ ఇచ్చాం. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి" అన్నారు.