కుటుంబాన్ని నమ్ముకుని సినిమాల్లోకి రావొద్దు.. దమ్ము వుండాలి: రేణు దేశాయ్
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వుందనే అంశంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. నెపోటిజం అన్ని రంగాల్లోనూ ఉంటుందని చెప్పారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంపై రేణు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రంగంలోనైనా నెపోటిజం సహజమని.. నైపుణ్యాలు ఉండి ధైర్యంగా నిలబడగలిగితే దాన్ని జయించి విజయం సాధించొచ్చని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తని రేణు అభిప్రాయపడ్డారు. సినిమాల్లో రాణించే నైపుణ్యత సుశాంత్‌కు వుంది కానీ.. అయితే, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడేమోనని అన్నారు.
అందుకే ఆయన కుంగుబాటుకు గురై ఉంటాడని రేణు దేశాయ్ చెప్పారు. కేవలం కుటుంబ నేపథ్యాన్ని నమ్ముకుని సినీ రంగంలోకి రావద్దని, నటులకు మనో ధైర్యం కూడా ఉండాలని ఆమె హితవు పలికారు. సినిమా రంగంలో మెరుగ్గా రాణించాలంటే మానసిక ధైర్యం కూడా అవసరమని చెప్పారు. సుశాంత్ సింగ్ మనోధైర్యం లేకపోవడం వల్లే సినిమాల్లో రాణించినా.. జీవితంలో ఎదగలేకపోయాడని చెప్పుకొచ్చారు.